Vallabhaneni Janardhan: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నటులు మరణించారు. కైకాల సత్యనారాయణ, చలపతిరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. వందల చిత్రాల్లో నటించి, తెలుగు తెరపై తమదైన ముద్ర వేసిన కైకాల, చలపతిరావుల మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. చలపతిరావు అంత్యక్రియలు ముగిసి రెండు రోజులు కాకుండానే మరో సీనియర్ నటుడు కన్నుమూశారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ వల్లభనేని జనార్ధన్ నేడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

కొంత కాలంగా వల్లభనేని జనార్ధన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.జనార్దన్ వయసు 63ఏళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం జనార్ధన్ కన్నుమూశారు. 1959 సెప్టెంబర్ 25న ఏలూరు సమీపంలో గల ఒక కుగ్రామంలో వల్లభనేని జనార్ధన్ జన్మించారు. సినిమాపై మక్కువతో అతి చిన్న ప్రాయంలో ఆయన పరిశ్రమలో అడుగుపెట్టారు. 21 ఏళ్ల వయసులో ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కుమార్తె నళినీ చౌదరిని జనార్ధన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ గా సెటిల్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిలో ఒకరైన శ్వేత చిన్నతనంలోనే మరణించారు. ఆమె పేరున శ్వేతా ఇంటర్నేషనల్స్ బ్యానర్ ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలు నిర్మించారు.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన పరిశ్రమలో కొనసాగారు. చిత్ర పరిశ్రమకు సేవలు చేశారు. చిరంజీవి బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ మూవీలో జనార్దన్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ రోల్ చేశారు. ఆ రోల్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. ఈటీలో ప్రసారమైన థ్రిల్లర్ సిరీస్ అన్వేషిత లో ఆయన నటించారు. జనార్దన్ మరణవార్త విన్న చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.