
Kantara: కన్నడ చిత్రం కాంతార మరో అరుదైన గౌరవం అందుకుంది. నేడు ఐక్యరాజ్య సమితి వేదికపై ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ మేరకు UNO అధికారిక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ దేశాల ప్రతినిధులు కాంతార చిత్రాన్ని వీక్షించనున్నారు. అనంతరం చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు. కాంతార చిత్ర విశేషాలు అంతర్జాతీయ వేదికపై పంచుకోనున్నారు. ఒక రీజన్ లాంగ్వేజ్ మూవీని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రదర్శించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ అవకాశం దక్కించుకున్న కాంతార మరో రికార్డు నమోదు చేసింది.
2022లో విడుదలైన చిత్రాల్లో కాంతార ఒక సంచలనం. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. అన్ని పరిశ్రమల్లో కాంతార మోత మోగించింది. దర్శకుడు రిషబ్ శెట్టి పంజుర్లి అనే అడవి దేవుడు నేపథ్యంలో కాంతార తెరకెక్కించారు. కర్ణాటకలో కొన్ని అడవి తెగలు పూజించే దేవుడు పంజుర్లి. వారి సంస్కృతి, సంప్రదాయాలను తెరపై ఆవిష్కరించారు. భూమిపై హక్కు, సెంటిమెంట్స్ వంటి కోణాలు ఈ చిత్రంలో చర్చించారు.

రిషబ్ శెట్టి నటన గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా చెప్పుకున్నారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార వరల్డ్ వైడ్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ మేకర్స్ హోమ్బలే ఫిల్మ్స్ నిర్మించారు. ఇక తెలుగులో కూడా కాంతార సంచలన విజయం నమోదు చేసింది. నిర్మాత అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు కాంతార తెలుగు విడుదల హక్కులు సొంతం చేసుకున్నారు.
రన్ ముగిసే నాటికి కాంతార ముప్పై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. భారీ లాభాలు పంచిన చిత్రంగా రికార్డులు ఎక్కింది. ఆ మధ్య కాంతార 2 ఉంటుందని రిషబ్ శెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. రిషబ్ ప్రకటన ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. ఇక కాంతార చిత్రం చూడలేదంటూ హీరోయిన్ రష్మిక మందాన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. రిషబ్ శెట్టి ఆమెపై మండిపడ్డాడు. పరోక్షంగా రష్మికకు చురకలు వేశారు.