Atrocity In Hyderabad: కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు. నా అన్న వారి జ్ఞాపకాలు లేవు. ఇలాంటి సమయంలో వారిని క్రిస్టియన్ మతం మాటున కొనసాగుతున్న ఓ అనాధ ఆశ్రమం అక్కున చేర్చుకుంది. అసలే తల్లిదండ్రులు లేని ఆ పిల్లలు అక్కడ తలదాచుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. అసలే అనాధలు.. వారి ముఖం చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తుంది. కానీ కర్కశ మనసుల వల్ల ఇక్కడ కూడా వారికి భద్రత లేకుండా పోయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనను మరవక ముందే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ లోని జేజే నగర్ లో ఉన్న గ్రేస్ అనాధ ఆశ్రమంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న బాలికలతో కొంతమంది బాడీ మసాజ్ చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే
గ్రేస్ అనాధ ఆశ్రమంలో 34 మంది యుక్త వయసు ఆడపిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిపై కొంతకాలంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని బయటకు పక్కన లేకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సోమవారం రాత్రి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగిందంటూ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కు ఫిర్యాదు అందింది. దీంతో నేరేడుమెట్ పోలీసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గ్రేస్ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ విచారణ చేపట్టారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆశ్రమంలోని మిగతా బాలికలను నింబోలి అడ్డలోని స్టేట్ హోమ్ కు తరలించారు.
కూకట్ పల్లి మైత్రి చిల్డ్రన్ హోమ్ లోనూ
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీం వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. డిఏవి, గ్రేస్ అనాధాశ్రమంలో ఘటనలు మర్చిపోకముందే.. కూకట్ పల్లి కే పీ హెచ్ బీ కాలనీలో మైత్రి చిల్డ్రన్స్ హోమ్ లో బాలికలపై అకృత్యాలు సాగుతున్నాయి. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు దాడులు నిర్వహించారు. మైత్రి చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకుడు బిఎల్ నరసింహారావు, అతని కుమారుడు ప్రణీత్ కుమారులను అరెస్టు చేశారు. ఈ ఆశ్రమంలో వారిద్దరు కూడా బాలికలతో బాడీ మసాజ్ చేయించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా బాలికలతో బాత్రూంలను శుభ్రపరచడం, కూరగాయలు తరిగించడం, గదులను శుభ్రం చేయించడం వంటి పనులు చేయిస్తున్నారు.

పనులు చేసేందుకు చిన్నారులు నిరాకరిస్తే బెల్టుతో కొడుతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు చిన్నారుల వాంగ్మూలం తీసుకున్నారు. నిర్వాహకులు నరసింహారావు, ప్రణీత్ కుమార్ ను అరెస్టు చేశారు. కాగా గ్రేస్ అనాధాశ్రమం, మైత్రి చిల్డ్రన్స్ హోమ్ ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా కొంతకాలంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఆశ్రమాల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బాలికలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాల్లో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో ఓ ముస్లిం దంపతులు నిర్వహిస్తున్న ఆశ్రమంలో యుక్త వయసు పిల్లలపై నిర్వాహకుల బంధువులు లైంగిక దాడులకు పాల్పడేవారు. దీంతో ఆ విషయం ఆ నోట ఈ నోట పడి అధికారులకు చేరింది. తీరా వారు అక్కడికి వెళ్లి దాడులు చేస్తే కండోమ్ ప్యాకెట్లు, డ్రగ్స్ తీసుకున్న సిరంజ్ లు కనిపించాయి. దీంతో ఈ విషయంపై లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తే విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత అధికారులు ఆ బాలికలను జిల్లా కేంద్రంలోని ఆశ్రమానికి తరలించారు.. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం వారంతా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.