Anju Nasrullah Love Story: ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాకిస్తాన్ యువకుడి ప్రేమలో పడి అతడి కోసం దేశం నుంచి పాకిస్తాన్ పారిపోయి.. ప్రియుడిని పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని బౌనా గ్రామానికి చెందిన అంజు. భర్త, పిల్లలను వదిలి పారిపోయిన అంజు.. పాకిస్తాన్‌లో మతం మార్చుకుని సుఖంగా జీవిస్తోంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు భారత్‌లో దుర్భర జీవితం గడుపుతున్నారు. అనధికారికంగా సమాజిక బహిష్కరణకు గురయ్యారు. అంజు భర్తను అతను పనిచేసే కంపెనీలో పనికి తీసుకోవడం లేదు. అంజు సోదరున్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక వృత్తిరిత్యా టైలర్ అయిన అంజు తండ్రి గయా ప్రసాద్ థామస్ వద్దకు ఎవరూ బట్టలు కుట్టించుకోవడానికి రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ కూడా వారికి భారంగా మారింది. గ్వాలియర్ సమీపంలోని బౌనా గ్రామస్తులు అంజు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
మొదట సానుభూతి చూపి..
అంజు భర్త, పిల్లలను వదిలి పాకిస్తాన్ పారిపోవడంతో బౌన గ్రామస్తులు మొదట అంజు కుటుంబంపై సానుభూతి చూపారు. కానీ, ఇటీవల ఆ కుటుంబాన్ని శత్రువులా చూస్తున్నారు. స్థానికంగా ఎవరూ అంజు కుటుంబ సభ్యులకు పని ఇవ్వడం లేదు. అంజు తండ్రి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది.
జైపూర్ వెళ్లొస్తానని చెప్పి..
జూలై 20న అంజు తన భర్త, ఇద్దరు పిల్లలకు (15 మరియు 6 సంవత్సరాల వయస్సు) తాను జైపూర్‌కి వెళ్తున్నానని, త్వలోనే తిరిగి వస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఆమె జైపూర్ వెళ్లకుండా చెల్లుబాటయ్యే వీసాపై ఫేస్‌బుక్ ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు పారిపోయింది. అక్కడ మతం మార్చుకుని, తన పేరును కూడా ఫాతిమాగా మార్చుకుంది. తర్వాత ఫేస్‌బుక్ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
తమ ఊరి పరువు పోయిందని..
అంజు చర్యల కారణంగా తమ సంఘం ప్రతిష్ట మసకబారిందని, ఊరి పరువు పోయిందని బౌన గ్రామస్తులు కోపంగా ఉన్నారు. తమ ఊరు గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అంజు తిరిగి భారత దేశానికి వచ్చినా.. ఊళ్లోకి రానివ్వబోమని చెబుతున్నారు. ఇక అంజు పాకిస్తాన్ పారిపోయిన విషయం తెలిసిన తర్వాత అంజు భర్త అరవింద్ మీనా, ఆమె సోదరుడు డేవిడ్ థామస్ రాజస్థాన్‌లోని భివాడిలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరవింద్ ఇంట్లోనే ఉండాలని, కంపెనీ పేరును ఎక్కడా పేర్కొనవద్దని చెప్పినట్లు తెలిసింది.