Ram Charan : పుత్తడి గలవాని పుష్టంబు పుండైన
వసుధలోన చాల వార్త కెక్కు
పేదవాని యింట పెండ్లైన నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.
శతకారుడు వేమన ఈ పద్యం రాసి దాదాపు 400 సంవత్సరాలు దాటింది.. ఈరోజు ఓ పత్రిక చూస్తే ఓ వార్త పై పద్యాన్ని గుర్తుకుచేసింది.. పుత్తడి గల వారి ఇంట్లో జరిగిన ఓ సంఘటన ఆ పత్రికకు ప్రథమ ప్రాధాన్యం అయిపోయింది. ప్రఖ్యాత సినీ నటుడు రామ్ చరణ్ ఇంట్లో ఓ చిలుకను పెంచుకుంటున్నాడు.. అది ఆఫ్రికా నుంచి తెప్పించాడట. అతడు పెంచుకుంటున్న చిలుక ఇటీవల తప్పిపోయిందట. దానిని వెతికి పట్టుకోవడానికి కుటుంబ సభ్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేసారట. చివరికి రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో.. దానిని యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చూశారట.. ఆ చిలుకను వెతికి పట్టుకొని రాంచరణ్ దంపతులకు అప్పగించారట. ఆ చిలుకను ఇంటికి తీసుకురాగానే.. వెంటనే రామ్ చరణ్ భుజంపై కూర్చుందట. తను పెంచుకుంటున్న రామచిలుకను తిరిగి అప్పగించిన యానిమల్ వారియర్స్ బృందానికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారట. ఆ చిలుకను ఎలా కనిపెట్టామనేది యానిమల్ వారియర్స్ టీం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిందట. ఇదీ ఓ పత్రికలో కనిపించిన వార్త.
ఈ వార్త చదివిన తర్వాత శతకారుడు వేమన రాసిన పద్యం కచ్చితంగా గుర్తుకు వస్తుంది.. ఎందుకంటే మీడియా డబ్బున్న వాళ్లకు, రాజకీయ నాయకులకు, శ్రీమంతులకు ఇచ్చిన ప్రయారిటీ సామాన్యులకు ఇవ్వదు. అనన్య సామాన్యమైన విజయాలు సాధించినప్పుడు.. గొప్ప గొప్ప రికార్డులను సృష్టించినప్పుడు మాత్రమే సామాన్యులకు స్వల్ప స్థాయిలో కవరేజ్ ఇస్తుంది. రామ్ చరణ్ ఇంట్లో నుంచి చిలుక తప్పిపోవడం.. దానిని యానిమల్ వారియర్స్ బృందం పట్టుకోవడం.. వంటి విశేషాలు ఆ పత్రికకు వార్త లాగా కనిపించాయి.. కేవలం రామ్ చరణ్ విషయంలోనే కాదు.. సెలబ్రిటీల విషయంలో మీడియా చూపించే అత్యుత్సాహం మామూలుగా ఉండదు. ఇటీవల మంచు మనోజ్, మంచు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన గొడవను మీడియా ఏ స్థాయిలో చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ఒళ్ళు మండిన మోహన్ బాబు మైక్ తో ఓ టీవీ ఛానల్ ప్రతినిధి తలను పగలగొట్టాడు. అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ – మాధురి విషయంలోనూ మీడియా ఇదే తీరుగా వ్యవహరించింది. మరింత లోతుగా కథనాలను ప్రసారం చేస్తూ.. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించింది. ఈ వ్యవహారంలో మాధురి కారు డ్రైవ్ చేస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య – మస్తాన్ సాయి ఎపిసోడ్ లోనూ మీడియా ఇలానే వ్యవహరిస్తోంది. అంతకుముందు లావణ్య – రాజ్ తరుణ్ వ్యవహారంలోనూ మీడియా సొంతంగా జడ్జిమెంట్ ఇచ్చి పడేసింది. రాజ్ తరుణ్ తప్పు చేశాడని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు లావణ్య కు సంబంధించి ఇతర విషయాలు తెలియడంతో నాలుక కరుచుకుంది. అయినప్పటికీ సెలబ్రిటీల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికి అలానే ఉంది. స్థూలంగా చెప్పాలంటే పత్రికలు, చానల్స్, వెబ్ మీడియా, డిజిటల్ మీడియా.. పేర్లు మాత్రమే వేరు.. సెలబ్రిటీల విషయంలో సాగిలపడే తీరు మాత్రం ఒకటే. అందువల్లే జనం మీడియా అంటేనే చీదరించుకుంటున్నారు. ఏవగించుకుంటున్నారు. అందులో ఎలాంటి వార్త ప్రచురితమైనా, ప్రసారమైనా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంచలనాలను వ్యాప్తి చేయడం.. జరగనిదాన్ని జరిగినట్లు చూపించడం.. సెలబ్రిటీల జీవితాల్లో తొంగి చూడటం మీడియా అలవాటుగా మార్చుకుంది. వార్తలేవి లేనట్టు.. ప్రపంచంలో ఎటువంటి సంఘటనలు జరగనట్టు.. చిలుక తప్పిపోతే.. వార్తను ప్రచురిస్తున్న మీడియాకు కోటాను కోట్ల దండాలు.