
AP- Telangana Paddy Issue: పై చిత్రంలో ఓ పోలీస్ అధికారి లారీని అడ్డుకుంటున్నాడు కదా! అ లారీలో గంజాయో, గట్రో సరఫరా అవడం లేదు.. అందులో ఉన్నవి వడ్లు. యాసంగిలో ఆంధ్ర రైతులు పండించిన వడ్లు. వాటిని ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు రాని వద్దని కెసిఆర్ గట్టిపట్టు పట్టుకుని కూర్చున్నాడు.. ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశాడు.. ఈ వడ్లను తెలంగాణలోకి రానీయకుండా పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో గస్తి కాయిస్తున్నాడు. ఇదే కేసీఆర్ మొన్ననే కదా ఆంధ్రాలో అడుగు పెడతాం, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ను కాపాడుతాం.. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టుకో, గోదావరి, కృష్ణా జలాల్లో వాటా కోసం జరిపే పోరాటంలో సైలెంట్ గా ఉండాలని చెప్పింది.. మరి ఇప్పుడేంటి ఇలా యూ యూటర్న్ తీసుకున్నాడు.. అనే భావన కలిగి ఉండొచ్చు. కానీ కెసిఆర్ లెక్కలు ఎప్పటికీ ఒక పట్టాన అంతు పట్టవు.
అర్జెంటుగా భారత రాష్ట్ర సమితి ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ కావాలి. తెలంగాణతో పోల్చితే ఆంధ్ర పూర్తి డిఫరెంట్. అక్కడ కులాల రాజకీయాలు ఎక్కువ. పైగా అధికార వైఎస్ఆర్సిపికి అక్కడ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి.. కాబట్టి కెసిఆర్ కు స్కోప్ లేదు. పైగా ఆ తోట చంద్రశేఖర్ తో పెద్దగా ఫాయిదా లేదు. తన పార్టీకి ఒక అధ్యక్షుడు కావాలి కాబట్టి, తోట చంద్రశేఖర్ కు హైదరాబాదులో భూ లావాదేవీలు ఉన్నాయి కాబట్టి కెసిఆర్ తన ఫోల్డ్ లోకి తీసుకున్నాడు. అంతేకాదు ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ కావడానికి నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక పత్రికను కూడా ప్రారంభించబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇవన్నీ జరుగుతుండగానే కెసిఆర్ కు ఆయాచిత వరంలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లభించింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఆసక్తి వ్యక్తీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది.. సరిగ్గా దీనినే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కేసీఆర్. బిడ్ దాఖలు చేసేందుకు ఏకంగా సింగరేణి సంస్థను లైన్ లో దించాడు.. సింగరేణి అధికారులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పంపించాడు.. తన కొడుకు కేటీఆర్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గౌతమ్ ఆదానిపై విమర్శలు చేయించాడు. చత్తీస్ గడ్ లో బైలదిల్లా గనులు అదానీ కి కేటాయించాలని తలా తోకా లేని ఆరోపణలు చేయించాడు.. కెసిఆర్ అనుకున్న పొలిటికల్ మైలేజీ రావడం, దీనికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కెసిఆర్ కు అనుకూలంగా ట్వీట్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. అయితే ఇక్కడ కేంద్రం తెలివిగా మేల్కొని కేసీఆర్ కు చురకలంటించింది.. జీతాలు ఇచ్చేందుకే దిక్కులేని సింగరేణి సంస్థను తన రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు బలి పెడుతున్నారని ఆరోపించింది.

ఇక వైజాగ్ స్టీల్ బిడ్ లో పాల్గొనేందుకు సింగరేణి సంస్థకు గురువారం (20 వ తేదీ వరకు) గడువు ఉంది. అయితే పోటీలో పెద్దపెద్ద సంస్థలో ఉండడంతో సింగరేణికి అవకాశం దక్కేది అనుమానంగానే ఉంది.. అయితే దీనివల్ల కేసీఆర్ పొలిటికల్ లెక్కలు బయటపడటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.. ఎలాగూ అక్కడ రాజకీయంగా ఎదిగే స్కోప్ లేదు కాబట్టి ఆంధ్రా పై తన ప్రేమను తగ్గించుకోవడం ప్రారంభించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రాంత ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని భారత రాష్ట్ర సమితి నాయకులు కవరింగ్ ఇచ్చుకుంటారు. ఇదే తెలంగాణ ప్రాంత రైతులు గతంలో వడ్లను పండించినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అమ్ముకున్నారు. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మీ వడ్లు మాకొద్దు అంటే పరిస్థితి ఏంటి?
ఆ మధ్య అశ్వరావుపేట, దమ్మపేటలో కూడా ఇదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పండే పామాయిల్ గెలలు చాలా నాణ్యంగా ఉంటాయి. వాటికి బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువ.. వాటికి తెలంగాణ ఆయిల్ ఫెడ్ చెల్లిస్తోంది చాలా తక్కువ.. కానీ తెలంగాణ ప్రాంత రైతులు ఆయిల్ ఫామ్ గెలలను ఆంధ్ర ప్రాంతంలో అమ్ముకునేందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రాంతంలో అధికారులు అడ్డుకున్నారు.. అప్పట్లో రైతులు ధర్నా చేస్తే ప్రభుత్వం అనివార్యంగా ధరలు పెంచింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ లీలలు కోకొల్లలు. ఒక్కటి మాత్రం స్పష్టం.. తన రాజకీయం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తాడు..