Anand Mahindra: దేశంలో పేరెన్నికగల మహీంద్రా అండ్ మహీంద్రా అనే కార్పొరేట్ సంస్థకు అధిపతి అయినప్పటికీ.. వేలకోట్లకు అధిపతి అయినప్పటికీ.. వేలాది మంది ఉద్యోగులకు బాస్ అయినప్పటికీ.. ఆనంద్ మహీంద్రాలో కించిత్ గర్వం కూడా ఉండదు. పైగా క్షణం తీరిక లేకుండా గడిపే ఆయన.. ఏమాత్రం సమయం దొరికినా వెంటనే ట్విట్టర్ ఎక్స్ లో దూరేస్తారు. తనకు నచ్చిన అంశాలను నెటిజన్ల తో పంచుకుంటారు. ఆయన తాజాగా 12th ఫెయిల్ అనే సినిమాకు సంబంధించి రివ్యూ ఇచ్చారు.. తనను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను నెటిజన్ల తో పంచుకున్నారు. ఒక సినిమా వీక్షకుడి లాగా ..12th ఫెయిల్ లో తనకు ఏం నచ్చాయో అన్ని విషయాలను సోదాహరణంగా వివరించారు.
సినిమా కథ: 12th ఫెయిల్ సినిమా కథను నిజ జీవితంలో అనేక ఆటు పోట్లు ఎదుర్కొని విజయవంతమైన ఐపీఎస్ అధికారి చరిత్ర ఆధారంగా రూపొందించారు.. ఈ చిత్రంలో కథానాయకుడు మాత్రమే కాదు.. ఈ దేశంలో అలాంటివారు చాలామంది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించి విజయాన్ని సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.
నటీనటులు: ఈ సినిమాకు సంబంధించి నటులు తమ ప్రాణం పెట్టి నటించారు. అందులో ఎవరి గురించి ఎక్కువ చెప్పినా ఇతరులను తక్కువ చేసినట్టు అవుతుంది. ఈ సినిమాలో నటీ నట వర్గాన్ని ఎంచుకోవడంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా విజయవంతమయ్యారు. సినిమాలో ప్రతీపాత్ర గుర్తుండిపోతుంది. ప్రతి సన్నివేశంలోనూ నటించారు అనేకంటే జీవించారు అనడం సబబుగా ఉంటుంది.. ఇక ఈ చిత్రంలో కథానాయకుడి పాత్ర పోషించిన విక్రాంత్ మస్సే బాగా నటించాడు. అతడి నటన జాతీయ పురస్కారానికి అర్హత సాధించింది. ఆ పాత్రలో అతడు జీవించాడు.
కథనం; కథ తర్వాత ఈ సినిమాకు కథనం ప్రాణం పోసింది. మంచి కథ కావడంతో కథనాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా ప్రాణం పెట్టి ముందుకు నడిపించాడు.. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూ సీన్ హైలెట్. ఇందులో కొంత కల్పితం ఉన్నప్పటికీ నవభారత నిర్మాణానికి ఎవరెవరు ఏం చేయాలో అది నిర్దేశిస్తుందని ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలంటూ దర్శకుడికి ఆనంద్ మహీంద్రా సూచించారు.
12th ఫెయిల్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రారంభం నుంచి విరామం వరకు బిగి సడలని కథ, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ యువకుడు ఐపీఎస్ ఎలా అయ్యాడు అనే చిన్న పాయింట్ తో.. అతడి జీవితంలోని మలుపులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్నట్టు ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్ గా ఈ చిత్ర బృందం నామినేషన్ దాఖలు చేసింది. ఈ చిత్రానికి ఈసారి ఆస్కార్ అవార్డు వస్తుందని అందరూ భావిస్తున్నారు. కాగా, ఆనంద్ మహీంద్రా తన చిత్రంపై ట్విట్టర్ ఎక్స్ ద్వారా రివ్యూ ఇవ్వడంతో కథానాయకుడు విక్రాంత్ మస్సే ఉబ్బి తబ్బిబవుతున్నాడు.. తమ చిత్రాన్ని చూసి బాగుందని కితాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడు.
Finally saw ‘12th FAIL’ over this past weekend.
If you see only ONE film this year, make it this one.Why?
1) Plot: This story is based on real-life heroes of the country. Not just the protagonist, but the millions of youth, hungry for success, who struggle against extrordinary… pic.twitter.com/vk5DVx7sOx
— anand mahindra (@anandmahindra) January 17, 2024