Anand Mahindra: జీవితం సాఫీగా సాగిపోతే ఎలాంటి కిక్కూ ఉండదు. ఆటుపోట్లను ఎదుర్కోవాలి. కష్టాలను చవి చూడాలి.. కన్నీళ్లను అధిగమించాలి. బాధలను ధీటుగా అనుభవించాలి. అప్పుడే మనిషి జీవితానికి ఒక సార్ధకత ఉంటుంది. ఇవే సూత్రాలు మన నిజ జీవితంలో నడిపే వాహనాలకు కూడా వర్తిస్తాయని చెబుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. మండే మోటివేషన్ పేరుతో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ..
సరైన రహదారి లేని.. ఉన్న ఆ కాస్త దారిపై కూడా గజ్జోడు మురికి నీటి గుంతలున్న దారిపై ఓ జీప్ ను ఓ వ్యక్తి నడుపుతున్నాడు. ఆ దారిలో మురికి నీటి గుంతలు ఉన్నప్పటికీ.. ఆ వాహనాన్ని అలాగే నడుపుతున్నాడు. అత్యంత కష్టసాధ్యమైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా వాహనాన్ని ముందుకే పోనిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు.. దీంతో అతడు మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆ వాహనాన్ని నడుపుతున్నాడు. దాదాపు నాలుగైదు గుంతలను అలాగే తప్పించి.. ఆ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ వాహనం నడిపే సమయంలో ఆ డ్రైవర్ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.. ఆ వాహనం కూడా అతడు చెప్పినట్టే విన్నది. అత్యంత క్లిష్టమైన దారిలో కూడా ఏమాత్రం మోరాయించకుండా ముందుకే వెళ్ళింది.
ఆ వాహనాన్ని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ ను చుట్టుపక్కల వాళ్ళు అభినందించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో నడిచినప్పటికీ ఆ వాహనం చెక్కుచెదరలేదు. దూరం నుంచి చూస్తుంటే ఆ జీపు మహీంద్రా కంపెనీ తయారు చేసిందని అర్థమవుతోంది. తన కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులను విభిన్నంగా ప్రమోట్ చేసుకునే నేర్పరితనం ఆనంద్ మహీంద్రా స్వంతం. అందుకే ఆయన సోషల్ మీడియా వేదికగా రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. మండే మోటివేషన్ పేరుతో ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. వాటన్నింటినీ చేదించుకుంటూ వెళ్లడమే మనిషి అసలు సిసలైన నైజమని.. దానిని ఆనంద్ మహీంద్రా ఇలా నిరూపించాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
You’ll get to your destination…
No matter how tough the road…#MondayMotivation
— anand mahindra (@anandmahindra) July 8, 2024