https://oktelugu.com/

Andhra Pradesh: వైసీపీ శ్రేణులకు కావాల్సింది బీమా కాదు జగన్.. భవిష్యత్తుకు ధీమా!

Andhra Pradesh: 2019 ఎన్నికల్లో గెలిచారు. కానీ వారు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదు. పార్టీ శ్రేణులకు దక్కాల్సిన గౌరవం వాలంటీర్లకు అప్పగించారు జగన్. 2019 ఎన్నికల్లో సైనికుల పనిచేసిన వైసీపీ శ్రేణులు.. 2024 ఎన్నికలకు వచ్చేసరికి డీలా పడ్డారు. అందుకు ముమ్మాటికి జగనే కారణం.

Written By:
  • Dharma
  • , Updated On : July 8, 2024 / 05:24 PM IST

    YSRCP Leaders was not insurances Wants Future Guarantee

    Follow us on

    Andhra Pradesh: వైసీపీ అంటే యమా క్రేజ్. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి క్యాడర్ సుశిక్షితులైన సైనికుల్లా పనిచేశారు. 2014లో అధికారంలోకి రాకపోయినా.. 67 స్థానాలతో సగర్వంగా నిలిచారు. అధికార పార్టీకి దీటుగా దర్పం వెలగబెట్టారు. పేరుకే టిడిపి అధికార పార్టీ అయినా.. చాలా విషయాల్లో తమదే పై చేయి అని సగర్వంగా చాటి చెప్పారు వైసిపి శ్రేణులు. గౌరవప్రదమైన సీట్లతో గెలవడంతో భవిష్యత్తు తమదేనని ధీమాతో ఉండేవారు. అదే కసితో పని చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచారు. కానీ వారు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదు. పార్టీ శ్రేణులకు దక్కాల్సిన గౌరవం వాలంటీర్లకు అప్పగించారు జగన్. 2019 ఎన్నికల్లో సైనికుల పనిచేసిన వైసీపీ శ్రేణులు.. 2024 ఎన్నికలకు వచ్చేసరికి డీలా పడ్డారు. అందుకు ముమ్మాటికి జగనే కారణం.

    కార్యకర్తలను విస్మరిస్తే.. ఏ స్థాయిలో ఓటమి ఎదురవుతుందో ఈ ఎన్నికలు జగన్ కు చేసి చూపించాయి. చేదు అనుభవాలను మిగిల్చాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను.. కనీసం 10% సీట్లైనా దక్కలేదు. దక్కినవి కేవలం 11 మాత్రమే. అవి కూడా అరకొర మెజారిటీయే. పోనీ రాయలసీమలో సీట్లు దక్కాయా? పట్టు దక్కిందా? ఉత్తరాంధ్రలో ఉనికి చాటుకున్నారా? అంటే అది లేదు. గెలిచింది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రమే. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి,పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి.. ఈ ముగ్గురే బలమైన నేతలు. మిగతా వారంతా బలహీన వర్గాల నుంచి ఎన్నికైన వారే. కనీసం ఉనికి చాటుకునేందుకు కూడా వీలు లేదు. అందుకే ఇప్పుడు క్యాడర్ జగన్ కు గుర్తొచ్చింది. తత్వం బోధపడింది.

    పులివెందుల నియోజకవర్గం వైయస్ కుటుంబానికి పెట్టని కోట. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు నిజమే. కానీ అంతకంటే మించి బానిసత్వం నేర్పారు. గత నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబానికి రాజకీయ వేదికగా మలిచారు. కానీ ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి జగన్ కు పులివెందుల కార్యకర్తలు గుర్తుకొచ్చారు. పార్టీ పునాదులు కదులుతున్నాయని అంచనా వేసి.. తన బలం వదులుకోకూడదని జగన్ భావిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తనకు ఎవరూ అవసరం లేదని భావించిన జగన్.. ప్రజాదరణ కోల్పోయేసరికి సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు గుర్తుకొచ్చారు. ఒక్క పులివెందుల కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తన నుంచి దూరం కాకూడదని భావించారు. అందుకే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. క్యాడర్ను మళ్లీ లైన్ లో తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి ఉచిత బీమా, ప్రమాద బీమా అని ఆసక్తికర పథకాలు తెరపైకి తెచ్చారు. కానీ నిజమైన కార్యకర్తకు తప్పు జరిగితే పరిహారం కాదు. నిజమైన గౌరవం అవసరం అన్న రాజనీతిని జగన్ తెలుసుకోలేకపోయారు.