Indian-American Surgeon: ఠాగూర్ సినిమా చూశారా… అందులో చిరంజీవి చనిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కానీ అక్కడి వైద్యులు ఆ చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తారు. లక్షలకు లక్షలు డబ్బులు గుంజుతారు. కానీ చిరంజీవి ఆధారాలతో సహా నిరూపించడంతో ఆ ఆసుపత్రి మూసివేతకు గురవుతుంది. సరే అదంటే సినిమా కాబట్టి అలా జరుగుతుంది. కానీ నిజ జీవితంలో లక్షలకు లక్షలు గుంజినా ఏమీ కాదు.. అలా చెల్లుబాటు అవుతూనే ఉంటుంది. మన ప్రజాప్రతినిధుల్లో చాలామందికి సొంత ఆసుపత్రులు ఉన్నాయి. కాబట్టి వాటిపై ఎలాంటి చర్యలు ఉండవు..ఇది మనదేశంలో ఒక రివాజుగా మారింది. ఇక ఇందులో లంచాలనేవీ షరా మామూలే. కానీ ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన భారతీయ డాక్టర్లు కూడా లంచాలకు మరుగుతున్నారు. అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకుంటున్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

3.3 మిలియన్ల డాలర్ల లంచం డిమాండ్ చేశాడు
వెన్నెముక శస్త్ర చికిత్స చేసేందుకు సుమారు 3.3 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నందుకు భారతీయ_ అమెరికన్ న్యూరో సర్జన్ కు 60 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కాలిఫోర్నియాలోని శాండీయాగో కు చెందిన 55 ఏళ్ల న్యూరో సర్జన్ డాక్టర్ లోకేష్ ఎస్. తంతు వాయా లాంగ్ బీచ్ లోనే పనికిరాని ఒక ఆసుపత్రిలో రోగులకు శస్త్ర చికిత్స చేశారు.. భారీగా మోసానికి పాల్పడ్డారు.. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆసుపత్రి యాజమాన్యం చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం డాక్టర్ లోకేష్ సెప్టెంబర్ 1న మెయిల్, వైర్, ఆరోగ్య సంరక్షణ సిఫార్సుల కోసం చట్ట విరుద్ధమైన చెల్లింపులు స్వీకరించారు.. కోర్టు విచారణలో తన తప్పును అంగీకరించాడు.. అతడు తన ముందస్తు విడుదల నిబంధనలను ఉల్లంఘించాడు.. తర్వాత అతడిని 2021 మే నుంచి ఫెడరల్ కోర్టు కస్టడీలో ఉంచింది. “2010 నుంచి 2013 వరకు, లాంగ్ బీచ్ లోని పసిఫిక్ హాస్పిటల్ యాజమాన్యంలోని మైకేల్ డ్రోబోట్ నుంచి డాక్టర్ లోకేష్ ఆసుపత్రిలో వెన్నెముక శాస్త్ర చికిత్సలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా లంచాలు స్వీకరించడం మొదలుపెట్టాడు.

వెన్నెముక శస్త్ర చికిత్స రకాన్ని బట్టి లంచం మొత్తం మారుతూ ఉంటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది.. అయితే ఈ వ్యవహారంలో ఆ హాస్పిటల్ యజమాని మైకేల్ 2018లో 63 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.. డబ్బు కోసం వేలాది మంది రోగులను పసిఫిక్ హాస్పిటల్ వచ్చేందుకు డాక్టర్ లోకేష్ అనేక రకాల కుట్రలు పన్నాడు..కిక్ బ్యాక్ లు, లంచాల కోసం ఇతర వైద్యులు, చిరో ప్రాక్టర్లు, విక్రయ దారులతో పన్నాగాలకు రూపకల్పన చేశాడు.. అయితే అమెరికాలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఉంటుంది కాబట్టి.. ఆ బీమా కంపెనీలు బిల్లులను ఆసుపత్రికి చెల్లించాయి. శస్త్ర చికిత్సల వ్యవహారంలో అనుమానం రావడంతో ఆ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అవి కూపి లాగడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది.. గత ఐదేళ్లలో 500 మిలియన్ డాలర్లకు పైగా బిల్లులు ఈ ఆసుపత్రికి వివిధ సంస్థలు చెల్లించాయి. అయితే దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. లోకేష్ వ్యవహారం వల్ల అమెరికాలో భారత్ పరువు పోయింది.. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచింది.