Biryani Fighting: నాలుగు దశాబ్దాల దాంపత్యం వారిది. ఎన్నో కష్ట నష్టాలను, అరమరికలను దాటారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసి శేష జీవితం గడుపుతున్నారు. అటువంటి వారి జీవితంలో ‘బిర్యానీ’ చిచ్చురేపింది. ప్రాణాల మీదకు తెచ్చింది. చెన్నైలో వెలుగుచూసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బిర్యానీ కోసం వివాదం జరుగుతున్న నేపథ్యంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలను తట్టుకోలేని భార్య భర్తను కౌగిలించడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

అయినవరం ఠాగూర్ నగర్లో కరుణాకరన్ (75), పద్మావతి (68) దంపతులు నివాసముంటున్నారు. పిల్లలదంరికీ పెళ్లిళ్లు జరగడంతో వారు కుటుంబాలతో దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వృద్ధ దంపతులిద్దరూ స్థానికంగా నివాసముంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట బిర్యానీ తెచ్చుకొని భర్త కరుణాకరన్ తినేశాడు. తనకెందుకు బిర్యానీ తీసుకురాలేదని భార్య పద్మావతి ప్రశ్నించింది. అక్కడి నుంచి గొడవ ప్రారంభమైంది. జీవితంలో ఎప్పుడైనా నాకు నచ్చింది వండిపెట్టావా అని భర్త.. తనకు నచ్చినట్టు ఎప్పుడైనా వ్యవహరించావా అని భార్య ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. ఒకరినొకరు దెప్పిపొడుచుకున్న క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కరుణాకరన్ ఇంట్లో ఉన్న కిరోసిన్ ను పద్మావతిపై పోసి నిప్పంటించాడు. ఆ మంటలను తట్టుకోలేని ఆమె కరుణాకరన్ ను కౌగిలించుకోవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

వృద్ధ దంపతుల కేకలు విన్న స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందని అంతా భావించారు. కానీ పోలీస్ విచారణలో భాగంగా వారి నుంచి వాంగ్మూలం సేకరించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓసి నీ దుంప తెగ బిర్యానీ అంత పనిచేసిందా అని కుటుంబసభ్యులు, బంధువులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. క్షణికావేశంతో చేసిన పని ఆ వృద్ధ దంపతులకు శాపంగా మారింది. సగానికి పైగా శరీరం కాలిపోవడంతో ఆ వృద్ధ దంపతుల వేదన అంతా ఇంతాకాదు.