Homeట్రెండింగ్ న్యూస్Amazon Forest: వేలమంది నివసించిన అమెజాన్‌ అడవుల్లో పురాతన నగరం.. అత్యాధునిక వ్యవస్థలు.. వైరల్

Amazon Forest: వేలమంది నివసించిన అమెజాన్‌ అడవుల్లో పురాతన నగరం.. అత్యాధునిక వ్యవస్థలు.. వైరల్

Amazon Forest: అమెజాన్‌.. ఈ పేరు వినగానే మనకు అతిపెద్ద అడవులు గుర్తొస్తాయి. ఈ తరం వారికి అతిపెద్ద ఈకామర్స్‌ సంస్థ గుర్తొస్తుంది. అయితే పచ్చని వృక్ష సంపదతో కనిపించే అమోజాన్‌ అడవుల్లో ఇటీవల ఓ పురాతన నగరాన్ని పరిశోధకులు గుర్తించారు. 2,500 ఏళ్ల నాటిదిగా ధ్రువీకరించారు. అమెజాన్‌ అడవుల్లో నివసించే వారి గురించి మనం తెలుసుకున్న చరిత్రను మార్చే రీతిలో ఇటీవల గుర్తించిన పురాతన నగరంలో విశేషాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

తూర్పు ఈక్వెడార్‌లో..
అమెజాన్‌ పరిధిలోని తూర్పు ఈక్వెడార్‌లో ఉన్న ఉపానో ప్రాంతంలో అతి పురాతన నగరాన్ని గుర్తించారు. అక్కడ వేలకొద్దీ దీర్ఘ చతురస్త్రాకారపు ఆకారంతో నిర్మాణాలు రోడ్లు, కాలువలతో అతిపెద్ద నగరమే ఉండేదని నిర్ధారించారు. అగ్నిపర్వతపు నీడలో ఉండే ఈ నగరం అంతరించిపోవడానికి అగ్నిపర్వతమే కారణమని భావిస్తున్నారు. ఇక పురాతన నగరంలో సుమారు 6 వేల దీర్ఘచతురస్త్రాకారపు నిర్మాణాలను గుర్తించారు. బహుషా అవి అక్కడి ప్రజల ఇళ్లు అయి ఉంటాయని భావిస్తున్నారు.

అద్భుత నిర్మాణాలు..
మనకు ఇప్పటికే పెరూలోని మచుపిచ్చు లాంటి దక్షిణ అమెరికాలోని ఎత్తయిన నగరాల గురించి విన్నాం. అక్కడి ప్రజలు సమూహాలుగా లేదా చిన్న స్థావరాలను ఏర్పాటు చేసుకుని నివసించేవారని నమ్మాం. కానీ, అమెజాన్‌లో గుర్తించిన ఆ పురాతన నగరపు ఆనవాళ్లను పరిశీలించాక, అందుకు భిన్నంగా మరో కోణం బయటకు వచ్చినట్లయిందని చెప్తున్నారు. ఈ పరిశోధనను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ ∙రొస్టెయిన్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు మేం గుర్తించిన వాటిలో నగరాల్లో ఇదే అతిపురాతనమైనది’ అని తెలిపారు. స్టీఫెన్‌ ఫ్రాన్స్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లోని రీసెర్చ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంస్కృతిని మార్చేలా..
‘ఇప్పటివరకు నాగరికతపై యూరప్‌ కేంద్రీకృత అభిప్రాయముండేది. కానీ, ఇది సంస్కృతి, నాగరికతల విషయంలో మన ఆలోచనను మార్చేలా ఉంది’ అని స్టీఫెన్‌ అన్నారు. ‘అమెజాన్‌ సంస్కృతిని మనం చూసే విధానమే ఇప్పుడు మారిపోయింది. అమెజాన్‌ ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా చిన్న గుడిసెలను నిర్మించుకుని, నగ్నంగా(స్పష్టంగా తెలియనప్పటికీ), నేలను చదును చేసుకుని జీవించేవారిని అనుకున్నాం. కానీ, ఈ పురాతన నగరాన్ని చూస్తుంటే క్లిష్టమైన అర్బన్‌∙సొసైటీల్లో జీవించినట్లు తెలుస్తోంది’ అని అధ్యయనపు సహ రచయిత, పరిశోధకులు ఆంటోనీ డోరిసన్‌ తెలిపారు.

వెయ్యేళ్లకుపైగా జనావాసాలు..
అమెజాన్‌లోని ఆ పురాతన నగరం 2500 ఏళ్ల క్రితం నిర్మితమైందని, అక్కడ వెయ్యేళ్లకు పైగా జనావాసాలు ఉన్నట్లుగా తెలుస్తోందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. అయితే ఏ సమయంలో ఎంతమంది జనాభా అక్కడ ఉండేవారో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, అయితే, ఆ సంఖ్య పదివేల నుంచి లక్ష వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 300 చరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లేజర్‌ సెన్సార్లతో చేపట్టిన సర్వే, పలు చోట్ల జరిపిన తవ్వకాల ఆధారంగా అక్కడున్న వృక్షాల కింద నగరానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. ఎల్‌ఐడీఏఆర్‌ టెక్నాలజీతో చేపట్టిన సర్వేలో ఆరువేల దీర్ఘచతురస్రాకారపు నిర్మాణాలు 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2–3 మీటర్ల ఎత్తులో నిర్మితమైనట్లు గుర్తించారు. ఇవి నగరపు మధ్య పాంత్రం చుట్టూ మూడు నుంచి ఆరు యూనిట్ల చొప్పున నిర్మించారని చెప్పారు. ఆ నిర్మాణాల్లో చాలావరకు గృహాలే అని భావిస్తున్నారు. ఎతై ్తన కొండ ప్రాంతాలను చదును చూసి, నేలకు కాస్త ఎత్తులో వాటిని నిర్మించారు. ఇక, ఆ నిర్మాణాలను అనుసంధానిస్తూ పొడవైన మార్గాలతో కూడిన రహదారుల వ్యవస్థ ఉంది. వాటిలో ఒక రోడ్డు మార్గం 25 కిలోమీటర్ల పొడవు వరకు ఉంది. ఆ మార్గాలే పరిశోధనలో ఎంతో ఆశ్చర్యకరమైన అంశమని డా. డోరిసన్‌ తెలిపారు. ‘రహదారుల వ్యవస్థ చాలా అధునాతనంగా ఉంది. చాలా దూరం వరకు విస్తరించి ఉంది. అంతా అనుసంధానమై ఉంది. కొన్నిచోట్ల ఆ మార్గాలు లంబాకృతిలో నిర్మితమై ఉండటం ఆకట్టుకునే విషయం’ అన్నారు. ‘అక్కడి భౌగోళిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అలా నిర్మాణాలు చేపట్టడం మామూలు విషయం కాదు’ అని తెలిపారు.

1970లో పురాతన నగరం గుర్తింపు..
తొలిసారిగా ఆ అతిపురాతన నగరం గురించిన ఆధారాలు 1970ల్లో గుర్తించారు. 25 ఏళ్ల అధ్యయనం అనంతరం సమగ్ర అధ్యయనాలను ప్రచురించడం ఇదే తొలిసారి. ఈ నిర్మాణాలు మధ్య మధ్యలో అతిపెద్ద వేదికలు కట్టడాన్ని చూస్తే, నమ్మకం, విశ్వాసంతో ముడిపడి ఉండొచ్చని, అలా నిర్మాణాలు చేపట్టడం వెనుక ఏదో నిగూఢమైన అర్థముందని అన్నారు డోరిసన్‌. కాజ్‌వేలకు ఇరువైపులా గుంటలు ఉండటాన్ని కూడా గుర్తించారు. బహుశా అక్కడి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వాటిని తవ్వి ఉంటారని భావిస్తున్నారు. ఆ పురాతన నగరానికి పొరుగు ప్రాంతాల నుంచి ముప్పు ఉన్నట్లుగా వారు నగరపు ప్రవేశం, సరిహద్దుల వద్ద తవ్విన కొన్ని గోతులను పరిశీలిస్తే తెలుస్తోందని అన్నారు. అందుకు ఆ గోతులే ఆధారమని నమ్ముతున్నారు.

యమన్‌ల నాగరికత తరహాలో..
యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్స్‌టర్‌లోని ఆర్కియాలజీ ప్రొఫెసర్‌ జోస్‌ ఇరియార్టే మాట్లాడుతూ, ‘మయన్‌ల నాగరికత తరహాలో మరో నాగరికత ఉనికిని వారు గుర్తించారని మీరు అర్థం చేసుకోవాలి. వారి కన్నా కూడా భిన్నమైన సాగు, సిరామిక్స్‌ నిర్మాణాలతో కూడిన పురాతన నగరంలో వారు జీవించారని ఊహించుకోండి‘ అని చెప్పారు. దక్షిణ అమెరికాలోని ఆ ప్రాంతంలో అరుదైన అష్టభుజి, దీర్ఘచతురస్రాకారాల్లో చేపట్టిన నిర్మాణాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బహుశా కిలామోపె, ఉపానోలకు చెందిన ప్రజలు అక్కడ నివసించి ఉండొచ్చని, వారు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న, చిలకడదుంపలు తినేవారు. ‘చిచా’ అనే ద్రావణాన్ని సేవించేవారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular