Homeజాతీయ వార్తలుTelangana BJP: పెద్ద ప్లాన్.. తెలంగాణలో గెలుపు కోసం ‘రాజస్థానీని’ దించిన అమిత్ షా

Telangana BJP: పెద్ద ప్లాన్.. తెలంగాణలో గెలుపు కోసం ‘రాజస్థానీని’ దించిన అమిత్ షా

Telangana BJP: పార్లమెంట్ ఎన్నికలకు ఇంక నోటిఫికేషన్ విడుదల కాకముందే భారతీయ జనతా పార్టీ అనేక అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం గట్టి పట్టు లేని నేపథ్యంలో ఈ రాష్ట్రాలపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పుకోదగిన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకోగలిగింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవలి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడం, కాంగ్రెస్ కు కూడా భారీగా స్థానాలు రాకపోవడంతో..ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో అమిత్ షా పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కచ్చితంగా 10 సీట్లు గెలవాలని స్పష్టం చేశారు. ఆయన సమావేశం కొద్ది రోజులకే తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ మరింత పెట్టారు. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ భారత దేశంలో భారతీయ జనతా పార్టీకి కీలకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించారు. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విషయంలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ ను ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను ఒక్క తాటి పైకి తేవడంలో చంద్రశేఖర్ విజయం సాధించారు. ముఖ్యంగా వసుంధర రాజే వర్గాన్ని సముదాయించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ లో చాలా సంవత్సరాలు పనిచేయడంతో చంద్రశేఖర్ కు రాజస్థాన్ లో మంచి పేరు ఉంది. రాజస్థాన్ ఎన్నికల్లో పోషించిన పాత్రనే తెలంగాణ రాష్ట్రంలోనూ పోషించాలని చంద్రశేఖర్ కు అమిత్ షా ఇటీవల సూచించారు. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి బలాలు, బలహీనతలను కూడా వివరించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు అయితే వచ్చాయో… అటువంటి ఫలితాలనే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ సాధించాలని చంద్రశేఖర్ కు లక్ష్యంగా పెట్టారు.. పైగా ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పది పార్లమెంటు స్థానాలు గెలవాలని అమిత్ షా పార్టీ నాయకులకు ఉద్బోధించారు.

ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బిజెపి నాయకత్వం ఉంది. ముచ్చటగా మూడోసారి కూడా తానే ప్రధానమంత్రి అవుతానని నరేంద్ర మోడీ పలు సమావేశాల్లో చెబుతున్నారు. ఆ భారాన్ని మొత్తం గత ఎన్నికల్లో మాదిరే అమిత్ షా పై వేశారు. అందుకు తగ్గట్టుగానే అమిత్ షా కూడా అడుగులు వేస్తున్నారు.. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏకంగా మూడు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ మధ్య తెలంగాణలోనూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అధిష్టానం చేజేతులా నాశనం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పది స్థానాలు సాధించగలుగుతుందా? తెలంగాణ రాష్ట్రంలో జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలువరించగలుగుతుందా? చంద్రశేఖర్ రాజస్థాన్ రాష్ట్రంలో మాదిరిగా మ్యాజిక్ ప్రదర్శించగలుగుతారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన బిజెపి నాయకులను కలిపి.. ఎన్నికలకు సమాయత్తం చేసిన దానినిబట్టే బిజెపికి పార్లమెంటు ఎన్నికల్లో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని వారు అంటున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular