American Airlines Flight: గాలి బీభత్సానికి బోయింగ్ విమానం ఆట బొమ్మలా కదిలిపోయింది..

అమెరికాలో మే నెలలో కనివిని ఎరుగని స్థాయిలో టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. టెక్సాస్, ఓక్లహామా, అర్కన్సాస్ నగరాలను టోర్నడో లు వణికిస్తున్నాయి. శక్తివంతమైన గాలుల తాకిడికి అక్కడ నష్టం అపారంగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 30, 2024 11:01 am

American Airlines Flight

Follow us on

American Airlines Flight: హోరుమంటూ గాలి.. చెట్లు కదిలిపోయాయి.. కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కరెంటు తీగలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాలికి వర్షం కూడా తోడు కావడంతో జనజీవనం స్తంభించింది. కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది.. వర్షాలు కురిసినప్పుడు.. టోర్నడోలు విరుచుకుపడినప్పుడు అమెరికాలో ఇది సర్వసాధారణమే. అయితే ఈసారి అక్కడ కురుస్తున్న వర్షాలకు.. వీస్తున్న గాలులకు జనజీవనం స్తంభించి పోవడమే కాదు.. విమానాశ్రయంలో విమానాలు కూడా ఆట బొమ్మల్లా కదిలిపోయాయి . బోయింగ్ సంస్థకు చెందిన ఓ పెద్ద విమానం గాలి తీవ్రతకు కదలిపోవడం విశేషం.

అమెరికాలో మే నెలలో కనివిని ఎరుగని స్థాయిలో టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. టెక్సాస్, ఓక్లహామా, అర్కన్సాస్ నగరాలను టోర్నడో లు వణికిస్తున్నాయి. శక్తివంతమైన గాలుల తాకిడికి అక్కడ నష్టం అపారంగా ఉంది.. పెను గాలుల బీభత్సానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియో ప్రకారం డల్లాస్ లోని ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బోయింగ్ 737-800 విమానం.. గాలుల తాకిడికి బొంగరం లాగా తిరిగిపోయింది. ఆ సమయంలో ఆ విమానంలో ప్రయాణికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఈ వీడియో రికార్డయింది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎయిర్ పోర్ట్ లో గేట్ సీ – 21 వద్ద ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచ్చాయి. ఆ గాలుల ప్రభావానికి 202 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరో 500 కు మించిన సర్వీసులలో తీవ్ర జాప్యం ఏర్పడింది. తుఫాన్ వల్ల టెక్సాస్ ప్రాంతంలో చాలా ఇల్లు ధ్వంసమయ్యాయి. బేస్ బాల్ పరిమాణంలో వడగళ్ళు పడ్డాయి. 10 లక్షల కుటుంబాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల వల్ల టెక్సాస్, మిస్సోరి, కెంటకీ, ఉత్తర కరోలినా, వర్జీనియా ప్రాంతాలలో 24 మంది మృతి చెందారు..హ్యూస్టన్ ప్రాంతంలో విపరీతమైన వరదలు రావడంతో.. వేలాది సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలిపోవడంతో 16 సంవత్సరాల బాలుడు కన్నుమూశాడు.. ఇటీవల అమెరికా వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. అందువల్లే ఈ టోర్నడోలు, వర్షాలు విరుచుకుపడుతున్నాయని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు.