Amazing Invention : ఈ వాహనం చూడగానే.. బుల్లెట్ అనుకుంటున్నారా.. అయితే తప్పులో కాలేసినట్లే.. మధ్యలో చూడగానే ఆటో ఇంజిన్ మరి ఆటో అనుకుంటే పొరపాటే.. ఇక వెనుక చూడగానే టైర్లు, నాగళ్లు చూడగానే ట్రాక్టర్‌లా అనిపిస్తుంది. కానీ ట్రాక్టర్ కాదు.. దీనిని ట్రిల్లెట్ బండిగా పిలుస్తున్నారు. బుల్లెట్ బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనంలో దీనిని బుల్లెట్ ట్రాక్టర్‌గా పిలుస్తున్నారు. రైతులు. వ్యవసాయంలో అన్నదాతకు ఎంతో అండగా నిలుస్తున్న ఈ యంత్రం తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయడంతోపాటు ఖర్చు కూడా తగ్గిస్తుంది అంటున్నారు నల్లగొండ జిల్లా రైతులు.
గుజరాత్ నుంచి తెప్పించి..
ఈ బుల్లెట్ ట్రాక్టర్‌ను గుజారాత్ నుంచి తెప్పించారు నల్లగొండ జిల్లా రసూల్‌పురం రైతులు. ఆరేళ్ల క్రితం దీనిని ఓరైతు తెప్పించాడు. దీనికి డ్రైవర్‌గా పనిచేసిన జాదయ్యయాదవ్ వ్యసాయంలో వివిధ పనులకు ఉపయోగించాడు. దుక్కి దున్నడం, కలుపు తీయడం, సాళ్లు పెట్టడం, పొలానికి మడి సిద్ధం చేయడం వంటి అనేక పనులు చేస్తున్నట్లు తెలిపారు.
డ్రైవర్ నుంచి ఓనర్‌గా..
బుల్లెట్ ట్రాక్టర్‌పై ఆరేళ్లు డ్రైవర్‌గా పనిచేసిన జాదయ్యయాదవ్ ఇప్పుడు సొంతంగా వాహనం కొనుగోలు చేశాడు. దీనికి రూ.60 వేలు ఖర్చయిందని చెప్పాడు. వామనంతో వచ్చిన నాగళ్లతోపాటు.. తన పనులకు అనుకూలంగా ఉండేందుకు మరో రూ.20 వేలు వెచ్చించి మనో నాగళి తయారు చేయించాడు. వివిధ వ్యవసాయ పనులకు ఉపయోగించేలా సొంత కల్టివేటర్ తయారు చేయించాడు. అడ్జస్టబుల్ కల్టివేటర్‌తో రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
రూ.100తో ఎకరం పొలం..
మెట్ట భూములను దున్నడానికి మాత్రమే ఈ బుల్లెట్ ట్రాక్టర్ పనిచేస్తుంది. లీటర్ డీజిల్‌లో గంటసేపట్లో ఎకరం పొలం దున్నొచ్చంటున్నారు రైతులు. చాలా మంది దీనిని అద్దెకు తీసుకెళ్తున్నారు. ఎకరాన్ని విత్తనాలకు సిద్దం చేయడానికి ఏడుసార్లు దున్నాలి.. ట్రాక్టర్‌తో అయితే గంటకు రూ.1000 చొప్పున ఏడు వేలు ఖచ్చవుతుందని, బుల్లెట్ ట్రాక్టర్ అయితే రూ.700 తో ఎకరం పొలం దున్నొచ్చని చెబుతున్నారు.
దుక్కి దున్నడంతో పాటు ఇతర పనులు..
దుక్కి దున్నడంతోపాటు ఇతర పనులకు కూడా ఈ బుల్లెట్ ట్రాక్టర్ ఉపయోగపడుతుందని రైతుల చెబుతున్నారు. విత్తనాలు వేసుకోవచ్చని, జాకీ లిఫ్ట్ చేయవచ్చని, విత్తనాలు, ఎరువులు చల్లవచ్చని రైతులు వివరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బుల్లెట్ ట్రాక్టర్ వచ్చాక ఖర్చు, సమయం ఆదా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.