2022 Tollywood Roundup: గత ఏడాది సూపర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ, అల్లు అర్జున్, అఖిల్ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. వారు ఏడాది లోపు మరో సినిమా చేయలేకపోయారు. ఒకప్పటి హీరోలు సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అత్యధికంగా ఒకే ఏడాది 18 సినిమాలు విడుదల చేశారు. ఆనాటి కథలు, పరిస్థితులు, నిర్మాణ విలువలు దానికి సహకరించేవి. అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వందల కొద్ది సినిమాలు చేశారు. ఈ జనరేషన్ లో అలా సినిమాలు చేసే హీరోలే లేరు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న స్టార్స్ ని పక్కన పెడితే టైర్ టు హీరోలు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయలేకపోతున్నారు.

ఈ విషయంలో చిరంజీవి, రవితేజ, వెంకటేష్ బెటర్ అని చెప్పాలి. నెలల వ్యవధిలో వీరు రెండు చిత్రాలు విడుదల చేశారు. చిరంజీవి 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సిద్ధం చేశారు. ఆచార్య ఏప్రిల్ లో విడుదల కాగా… ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు ఆయన విడుదల చేసినట్లు. రవితేజ సైతం ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ విడుదల చేశారు. నేడు ధమాకా చిత్రంతో థియేటర్స్ లో దిగాడు. 2022లో మూడు సినిమాలు విడుదల చేసిన ఏకైక హీరో రవితేజ.
అలాగే వెంకటేష్ నటించిన ఎఫ్ 3, ఓరి దేవుడా చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. నాగార్జున ది ఘోస్ట్ అంటూ దుమ్ములేపే యాక్షన్ పంచారు. ఇక గత ఏడాది సూపర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ, అల్లు అర్జున్ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. 2022లో వారి నుండి ఒక్క సినిమా రాలేదు. 2021 డిసెంబర్ లో వీరిద్దరూ సందడి చేశారు. అఖండ, పుష్ప చిత్రాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. అఖండ బాలకృష్ణ కెరీర్లో మెమరబుల్ హిట్ అని చెప్పాలి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీ అఖండ.

ఇక పుష్ప సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాన్ ఇండియా విజయం సాధించిన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ కి ఎనలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. బాలయ్య వీరసింహారెడ్డి, అల్లు అర్జున్ పుష్ప 2 ఈ ఏడాది విడుదలవుతాయని ఫ్యాన్స్ భావించారు, కానీ జరగలేదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో కెరీర్లో ఫస్ట్ హిట్ నమోదు చేశాడు అఖిల్. ఆయన లేటెస్ట్ మూవీ ఏజెంట్ 2022లో థియేటర్స్ లో దిగుతుంది అనుకుంటే అది జరగలేదు. ఇక సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీ రిపబ్లిక్ విడుదలై ఏడాది దాటిపోయినా ఆయన నుండి మరో మూవీ రాలేదు. ప్రమాదానికి గురైన సాయి ధరమ్ విరామం తీసుకోవడంతో 2022లో ఆయన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.