
YCP- TDP: వైసీపీలోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? తిరిగి సొంత పార్టీ గూటికి చేరాలనుకొని భావిస్తున్నారా? ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారా? వైసీపీలో ఇమడలేకపోతున్నారా? టిక్కెట్ భరోసాతో పార్టీలో చేర్చుకున్న పెద్దలు ముఖం చాటేశారా? అక్కడి అసమ్మతి నాయకులతో వేగలేకపోతున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలు వాసుపల్లి మెడకు చుట్టుకుంటున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రెండోసారి దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన గణేష్ కుమార్ వైసీపీ ఒత్తిళ్లకు తాళలేక ఆ పార్టీ గూటికి చేరారు. కుమారుడ్ని అధికారికంగా పంపించి తాను మాత్రం అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో విసిగివేశారిపోయిన ఆయన టీడీపీ వైపు యూటర్న్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
పక్కలో బల్లెంలా సీతంరాజు సుధాకర్..
ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాభావం ప్రభావం వాసుపల్లి గణేష్ కుమార్ పై కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ది విశాఖ దక్షిణ నియోజకవర్గమే. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుండేవారు. దక్షిణ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తూ వస్తుండేవారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను వైసీపీ వైపు తెచ్చారు. దీంతో ఇక్కడ వైసీపీలో గ్రూపుల గోల మొదలైంది. దీంతో హై కమాండ్ ఒక ఆలోచన చేసింది. సీతంరాజు సుధాకర్ ను పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీ చేయాలని తలపోసింది. కానీ హైకమాండ్ ఒకటి తలస్తే మరోలా ఫలితం వచ్చింది. సుధాకర్ కు ఓటమి తప్పలేదు. కానీ తిరిగి నియోజకవర్గంలో అడుగుపెట్టిన సుధాకర్ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు.
ఓటమితో కోలా గురువులు…
దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు అధికం. ఆ కోటా కిందే వాసుపల్లి గణేష్ కు టీడీపీ గత రెండుసార్లు టిక్కెట్ ఇచ్చింది. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన కోలా గురువులు వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. దీంతో హైకమాండ్ వాసుపల్లి గణేష్ కుమార్ కు లైన్ క్లీయర్ చేసేందు కోలా గురువులను ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ చేసేందుకు డిసైడ్ అయ్యింది. కానీ వైసీపీ ప్రకటించిన ఏడుగురు అభ్యర్థుల్లో కోలా గురువులు ఓడిపోయారు. దీంతో మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో నిలబడ్డారు. కోలా గురువులపై హైకమాండ్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దీంతో ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో వాసుపల్లి గణేష్ కుమార్ పునరాలోచనలో పడ్డారు.

తొలుత వాసుపల్లిపైనే అనుమానం..
మొన్నటి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వాసుపల్లి గణేష్ కుమార్ పై అనుమానాపు చూపులు చూసినట్టు వార్తలు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో గణేష్ కుమార్ ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిగా తేల్చడంతో వివాదం సద్దుమణిగింది. అయితే గత కొంతకాలంగా గణేష్ చర్యలు గమనిస్తున్న అధికార పార్టీ నేతల్లో అనుమానమైతే ఉంది. అయితే ఎమ్మెల్సీలుగా సీతంరాజు సుధాకర్, కోలా గురువులు ఎన్నికై ఉంటే గణేష్ పై ఎటువంటి ప్రభావం ఉండేది కాదు. కానీ ఆ ఇద్దరు నేతలు ఓడిపోయి.. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను ఆశిస్తున్నారు. దీంతో గణేష్ పునరాలోచనలో పడ్డారు. అందుకే టీడీపీ వైపు వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సాగర నగరంలో టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకూ వాస్తవమో చూడాలి మరీ.