
IPL 2023: ఐపీఎల్ 16 వ ఎడిషన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.. హోరాహోరీ ఆటతీరుతో ప్రేక్షకులను అలరించేందుకు జట్లు సిద్ధమవుతున్నాయి.. నిన్న పంజాబ్, రాజస్థాన్, లక్ నవూ గురించి చెప్పుకున్నాం కదా! ఇవ్వాళా ఢిల్లీ, బెంగళూరు, ముంబై జట్ల పై ఓ లుక్కేద్దాం!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ కప్ కోసం గత పదిహేనేళ్లుగా ప్రతీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతీ సీజన్ ఆరంభంలో ఈసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం.. ఓటములతో నిరాశపర్చడం ఆర్‌సీబీకి అలవాటుగా మారింది. డుప్లెసీ కెప్టెన్సీలో జట్టు గతేడాది ప్లేఆఫ్స్ వరకు వెళ్లి రాజస్థాన్ చేతిలో ఓడింది. దినేశ్ కార్తీక్, రజత్ పటీదార్, డుప్లెసీ బ్యాటింగ్‌లో రాణించగా.. స్పిన్నర్ హసరంగ 26 వికెట్లతో సెకండ్ బెస్ట్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ విరాట్ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. అయితే గత ఆరు నెలలుగా కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండడం ఈసారి జట్టుకు కలిసిరానుంది. ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, హసరంగ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలింగ్‌లో సిరాజ్, హర్షల్ ప్రధాన పేసర్లు కాగా హాజెల్‌వుడ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

బెంగళూరులో
కీలక ఆటగాళ్లు
డుప్లెసీ (కెప్టెన్),
దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్, హసరంగ.
ముంబై ఇండియన్స్ ది ఘన చరిత్ర
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ది ఘనచరిత్రే. ఏకంగా ఐదు టైటిళ్లతో అన్ని జట్లకన్నా ముందుంది. కానీ గత సీజన్ మాత్రం ఈ జట్టుకు అత్యంత పేలవంగా ముగిసింది. గెలుపన్నదే మర్చిపోయినట్టుగా వరుసగా ఎనిమిది పరాజయాలతో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేనా.. తమ లీగ్ చరిత్రలో తొలిసారిగా అట్టడుగున నిలిచింది. ఓపెనర్లు ఇషాన్, రోహిత్‌ల వైఫల్యం గట్టిగానే దెబ్బతీసింది. కానీ తిలక్ వర్మ, డివాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్ మాత్రం ఆశాకిరణాలుగా కనిపించారు. జట్టుకు భారంగా మారిన కీరన్ పొలార్డ్‌ను వేలం కన్నా ముందే వదిలేయగా.. కామెరూన్ గ్రీన్‌ను రూ.17.50 కోట్లకు తీసుకుంది. టీ20ల్లో నెంబర్‌వన్ బ్యాటర్ సూర్యకుమార్‌పై అధిక భారం పడనుంది. కానీ బౌలింగ్‌లో మాత్రం జట్టు బలహీనంగానే కనిపిస్తోంది. గాయంతో బుమ్రా ఆడే అవకాశం లేకపోగా.. రిచర్డ్‌సన్ కూడా దూరమయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ జట్టులోకి రావడం కాస్త సానుకూలాంశం. అలాగే నైపుణ్యం కలిగిన లెగ్ స్పిన్నర్ లేకపోవడం ప్రధాన లోటు.

ముంబైలో
కీలక ఆటగాళ్లు
రోహిత్ (కెప్టెన్), ఇషాన్, సూర్య
కుమార్, ఆర్చర్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గ్రీన్.
ఢిల్లీ క్యాపిటల్స్
డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో ఈ సీజన్‌కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో బరిలోకి దిగబోతోంది. 2016లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపిన వార్నర్ డీసీని కూడా టైటిల్ దిశగా నడిపిస్తాడని ఆశిస్తున్నారు. అయితే చివరి సీజన్ డీసీని నిరాశపరిచ్చింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఏడు ఓడి, ఏడు గెలవడంతో.. 2018 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించింది. గత వేలంలో బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు ఫిల్ సాల్ట్, రొసోలను తీసుకుంది. మొత్తానికి వార్నర్, పృథ్వీ షా, మార్ష్, సర్ఫరాజ్, పావెల్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. మనీష్ పాండే, అక్షర్ పటేల్ లోయరార్డర్‌లో రాణించగలరు. ఇక వికెట్ కీపర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది తేలాల్సి ఉంది. స్పెషలిస్ట్ కీపర్ కేఎస్ భరత్‌ను వేలానికి ముందే రిలీజ్ చేసింది. దీంతో పెద్దగా అనుభవం లేని సర్ఫరాజ్, పాండే, సాల్ట్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంది. పేసర్లు నోకియా, ఎన్‌గిడి వచ్చే నెల 3న జట్టులో చేరనున్నారు.

ఢిల్లీలో
కీలక ఆటగాళ్లు
వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, పృథ్వీ షా, అక్షర్, నోకియా, రొసో, మనీశ్ పాండే.