Actress Pakeezah Vasuki: వాసుకి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పాకీజా అంటే టక్కున గుర్తు పడతారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఆమె తెలియదు. 90లలో లేడీ కమెడియన్ గా ఆమె ఒక వెలుగు వెలిగారు. అసెంబ్లీ రౌడీ మూవీలో బాత్రామ్స్ కడితే స్టైలిష్ ఆయా పాకీజా పాత్రతో తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. పాకీజా-బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అసెంబ్లీ రౌడీ మూవీలో పెద్ద హైలెట్. రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన పాకీజా ప్రస్తుత పరిస్థితి అత్యంత దుర్భరం. తినడానికి తిండి లేదు. ఆరోగ్యం క్షీణిస్తుంది. దుర్భర పరిస్థితి నడుమ బతుకీడుస్తున్నారు.

చెన్నైలో రోడ్డుపై నిరాడంబరంగా నడిచి వెళుతున్న పాకీజాను ఓ మీడియా ప్రతినిధి చూశారు. గుర్తు పట్టి మీరు పాకీజా కదా… అని అడిగారు. అవును అని వాసుకీ సమాధానం చెప్పారు. రోడ్డుపై నడిచి వెళుతున్నారేమిటీ అని అడిగితే… నేను ప్రస్తుతం చెన్నైలో ఉండటం లేదు. మాది మదురై దగ్గర ఒక గ్రామం. అక్కడకు వెళ్ళిపోయాను. ఒక ఫ్రెండ్ ని కలవడానికి చెన్నై వచ్చాను. ఇక్కడ నాకు ఇల్లు లేదు. హాస్టల్ లో దిగాను. టీ నగర్ వెళ్ళాలి. చెన్నైలో బస్సులు ఉచితం కదా… బస్సు కోసం వేచి చేస్తున్నాను, అన్నారు.
ఏమైనా తిన్నారా? అని అడగ్గా… లేదు టీ తాగి బయలుదేరాను అన్నారు. ముందు భోజనం చేద్దాం పదండి , తర్వాత మాట్లాడుకుందాం అని సదరు ప్రతినిధి ఆమెను ఒక లగ్జరీ హోటల్ కి తీసుకెళ్లారు. మంచి భోజనం చేసి ఆరు నెలలు అవుతుందని పాకీజా చెబుతుంటే గుండెలు తరుక్కుపోయాయి. కూడబెట్టిన ఆస్తులు ఏమీలేవు. అమ్మ క్యాన్సర్ తో చనిపోయిందని వాసుకి చెప్పారు. అయినవాళ్లు పట్టించుకోవడం లేదు. నడిగర్ సంఘం ఉంది కానీ ఎలాంటి సహాయం చేయలేదు.

రజినీకాంత్, ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు స్టార్స్ కి నా పరిస్థితి వివరిస్తూ వీడియోలు పెట్టాను. అయినా ఎవరూ స్పందించలేదు. సహాయం చేయడానికి ముందుకు రాలేదు. నాకు షుగర్ వ్యాధి ఉంది. దాని కారణంగా యుటరస్ తీశారని దారుణం పరిస్థితి చెప్పుకొచ్చారు. తెలుగు నటి జయలలిత నాకు ఫ్రెండ్. ఆ రోజుల్లో చెన్నైలో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆమెతో కనెక్షన్ పోయింది. నంబర్ మిస్ అయ్యింది. జయలలిత తాను నటించే సీరియల్స్ లో నాకు కూడా వేషాలు ఇప్పించేందుకు ట్రై చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా కలిసి సహాయం గురించి అడగాలని వాసుకి తన వేదన వెలిబుచ్చారు.