
Sarath Babu Health: సీనియర్ యాక్టర్ శరత్ బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజులుగా ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందించారు. దీంతో ఆయన కోలుకున్నారు. ఐసీయూ నుండి సాధారణ గదికి మార్చారు. మరోసారి ఆయన ఆరోగ్యం విషమించింది. అనూహ్యంగా బెంగుళూరు నుండి శరత్ బాబును హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన కోలుకుంటున్నారు. శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. వైద్యుల ప్రకటన అభిమానుల్లో ధైర్యం నింపింది. శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951లో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో విడుదలైన రామ రాజ్యం మూవీతో నటుడిగా మారారు. ఐదు దశాబ్దాల కెరీర్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు చేశారు.
మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగులో నటించిన చివరి చిత్రం వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీలో ఆయన లాయర్ పాత్ర చేశారు. హీరో పవన్ కళ్యాణ్ ని మోటివేట్ చేసే పాత్రలో నటించారు. ఈ ఏడాది ఓ తమిళ చిత్రం చేశారు. బాబీ సింహ హీరోగా తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగులో వసంత కోకిలగా విడుదలైంది.

1974లో శరత్ బాబు లేడీ కమెడియన్ రమాప్రభని వివాహం చేసుకున్నారు. మనస్పర్థలతో అనంతరం విడిపోయారు. 1988లో రమాప్రభకు శరత్ బాబు విడాకులు ఇచ్చారు. 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఆయన వివాహ బంధం సవ్యంగా సాగలేదు. 2001లో స్నేహ నంబియార్ కి విడాకులు ఇచ్చారు. రమా ప్రభ విషయంలో శరత్ బాబు విమర్శలు ఎదుర్కొన్నారు. విడాకులు తర్వాత ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.