Achyutha Saddikuti: ఆమె ఒక సాధారణ గృహిణి. ఆమెకు యూట్యూబ్ అంటే కనీస పరిజ్ఞానం లేదు. భర్త, పిల్లలు, చిరు ఉద్యోగంతో ఏదో సాగిజోతున్న జీవితం. ఇలా గడిచింది. కానీ ఏడాదిలోనే ఆమె స్టార్ తిరిగింది.24 లక్షల మంది ఫాలోవర్లు, కోటికిపైగా వీక్షకులు, సెలబ్రిటీలు.. ఇలా ఒక్కసారిగా జీవితం మారిపోయింది. ఒక సాధారణ గహిణి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుంది. కేవలం నటన ద్వారా ఇది సాధ్యమైంది. నాటి సాధరణ మహిళ.. నేడు యూట్యూబ్ స్టార్ అయింది.. ఆమె అచ్యుతవల్లి సద్దికూటి.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని..
పుట్టాం.. పెరిగాం.. పోయామన్నట్లు ఉండకూడదు. పేరు చెప్పగానే ఠక్కున గుర్తుపట్టేయాలి. అది కూడా ఫలానా వాళ్లమ్మాయి, భార్యగా కాదు.. నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనుకునేది అచ్యుతవల్లి. దాని కోసం ఏదోకటి చేయాలనే తపన ఉండేది. పుట్టి పెరిగిందంతా ప్రకాశం జిల్లాలోని మొయిద్దీ¯Œ లో. బాగా చదువుకొని ఉద్యోగం చేయాలన్నది తండ్రి కోరిక. కానీ డిగ్రీ పూర్తవడంతోనే పెళ్లయ్యింది. అనంతపురంలోని అత్తారింటికి వెళ్లింది. భర్త సురేందర్‌రెడ్డి సాయంతో చదువు కొనసాగించిది. గర్భిణిగా ఉండి పీజీ పరీక్షలు రాసింది. పాప పుట్టాక ఉద్యోగం సాధించాలని బ్యాంకు కోచింగ్‌లో చేరా. దానికోసం వేరే ఊరు వెళ్లింది. కానీ పాపను విడిచి ఉండలేకపోయింది. తర్వాత బాబు పుట్టడం, ఆడపడుచు పురుడు, అత్తగారి బాధ్యత, పిల్లల చదువులు.. ఇలా ఏదోకటి అడ్డురావడంతో ఉద్యోగం కలగానే మిగిలింది. అలాగని ఖాళీగా ఏమీలేదు. బీఈడీ, డీఈడీ పూర్తిచేసింది.
ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా..
పిల్లలు పెద్దయ్యాక ఎస్‌బీఐలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా చేరింది. ఇంటి నుంచే పని! అయినా ఏదో అసంతృప్తి అచ్యుతవల్లిలో ఉంది. భర్త సలహాతో రెస్టారెంట్ ప్రారంభించింది. కొందరికైనా ఉపాధి ఇవ్వొచ్చని భావించింది. వ్యాపారం బాగా సాగుతోందనగా కొవిడ్ కారణంగా మూసివేసింది.
సరదాగా మొదలుపెట్టి..
లాక్‌డౌన్‌లో ఏమీతోచక టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. తర్వాత అదీ బ్యాన్ అయ్యింది. యూట్యూబర్ ప్రషూ ఓసారి ‘నటనపై ఆసక్తి ఉంది కదా! నా చానెల్‌లో నటిస్తావా అక్కా’ అని అడిగాడు. ఈ విషయం భర్తకు చెప్పడంంతో ‘ఆసక్తిగా ఉంటే ప్రయత్నించు’ అని చెప్పాడు. నటించడం మొదలు పెట్టింది. నిజానికి అప్పటివరకూ అచ్యుతవల్లికి యూట్యూబ్ పరిచయమే లేదు. ఎవరైనా క్యారెక్టర్ ఉందంటే నటించడం.. లేదంటే ఊరుకోవడం.
కొడుకు ప్రోత్సాహంతో..
తల్లిలోని నటనాసక్తిని గుర్తించిన అచ్యుతవల్లి కొడుకు ‘ఆసక్తి ఉంది కాబట్టి.. నువ్వే ప్రయత్నించొచ్చుగా అమ్మా.. కావాలంటే నేను సాయం చేస్తా’ అన్నాడు. అలా 2022 మేలో ‘అచ్యుత సద్దికూటి’పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఇంట్లో జరిగే సరదా సంఘటనలే కథా వస్తువులు. ‘తింగరి పెళ్లాం’, ‘అమ్మ కథ’, ‘వారానికో కథ’.. సిరీస్‌లకు మంచి ఆదరణ వచ్చింది. గోలీసోడా, పెళ్లిచూపులు స్కిట్లు యువతని బాగా ఆకట్టుకున్నాయి. మూణ్నాలుగు నెలల్లోనే పది లక్షలమంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. హాస్యమే కాదు.. సందేశాన్నీ జోడిస్తుంటా. ప్రతి వీడియోకీ లక్షల్లో ఆదరణ. మొత్తంగా 166 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ నుంచి గోల్డ్‌బటన్ అందుకుంది. ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపట్టి ‘అక్కా’ అని పలకరించినప్పుడు అనుకున్న గుర్తింపు తెచ్చుకుంది.