Hyderabad : ఈమధ్య డబ్బులు విసిరేయడం.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేయడం.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోవడం వంటి పరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. ఆ మధ్య రాజస్థాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన భారీగా నగదను విసిరేసి.. ఆ వీడియో మొత్తాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దెబ్బకు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఆ పని చేశారు.. కాకపోతే సెలబ్రిటీ కాలేకపోయారు. అయితే హైదరాబాదులోని ఓ షాపింగ్ మాల్ లో ఓ యువకుడు చేసిన సందడి అంతా కాదు. ఆ షాపింగ్ మాల్ లోకి బాన్సర్ల సహాయంతో ప్రవేశించాడు.. వెంటనే మీకు డబ్బులు విసిరేస్తాను అంటూ ఆఫర్ ఇచ్చాడు.. ఆ డబ్బులను ఎవరైనా తీసుకోవచ్చంటూ పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీసి అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అయితే అతడు డబ్బులు విసరలేదు. ఆ పని ఎందుకు చేయలేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వితండవాదానికి దిగాడు. దీంతో అతడితో వాదించడం ఎందుకు దండగనుకొని.. మిగతా వారు మొత్తం సైలెంట్ అయిపోయారు. ఈలోగా సెక్యూరిటీ ఎంట్రీ ఇవ్వడంతో అతడు వచ్చిన దారి వెంటే వెళ్ళిపోయాడు.
గతంలోనూ..
హైదరాబాదులోని ఆ షాపింగ్ మాల్ లో రచ్చ రచ్చ చేసిన ఆ యువకుడు.. గతంలోనూ ఇలాంటి పనికే పాల్పడ్డాడు. కూకట్ పల్లి ప్రాంతంలో రోడ్డుపైకి డబ్బులను అమాంతం విసిరేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మళ్లీ అలాంటి పనినే చేపట్టాడు. బౌన్సర్లను నియమించుకొని షాపింగ్ మాల్ లోకి వచ్చాడు. అతడు సూటు బూటు వేసుకొని సంచలనం సృష్టించాడు. షాపింగ్ మాల్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు విసిరేస్తాను.. ఎంతైనా తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలియడంతో షాపింగ్ మాల్ సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటికి పంపించారు. బౌన్సర్లను కూడా వెనక్కి వెళ్ళిపోవాలని సూచించారు. అయితే కొంతమంది ఇతర వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే షాపింగ్ మాల్ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తికి సోషల్ మీడియా పిచ్చి ఎక్కువగా ఉందని.. అందువల్లే ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టాడని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతగా డబ్బు ఎక్కువుంటే ఆలయాలకో, విద్యాలయాలకో విరాళం ఇవ్వొచ్చు కదా అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి పనులు చేస్తుంటారని.. అంతగా డబ్బులు ఎక్కువగా ఉంటే.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని.. పక్కన ఉన్న వాళ్లకు తోడ్పడాలని.. పేదలకు ఆర్థిక సాయం అందించాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
హైదరాబాదులోని ఓ షాపింగ్ మాల్ లో ఓ యువకుడు బౌన్సర్లను తీసుకువచ్చి హంగామా సృష్టించాడు. డబ్బులు విసిరేస్తానంటూ అక్కడికి వచ్చిన వారితో చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. #Hyderabad #Telangana pic.twitter.com/sRqVtLumQO
— Anabothula Bhaskar (@AnabothulaB) December 28, 2024