
Walking Mango Tree: మీరు ఎక్కడైనా నడిచే చెట్లను చూశారా..? అసలు చెట్లు నడిచే అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా కాదన్న సమాధానమే వస్తుంది. ఇలాంటి సమాధానాలు మీరు కూడా చెప్పినట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే గుజరాత్ లోని ఓ మహా వృక్షం కదులుతుంది. ఆ చెట్టు ఎక్కడ ఉంది.. ఇలా ఎందుకు నడుస్తోందో చదివేయండి.
ఒక చెట్టు తన జీవితకాలం ఒకే దగ్గర ఉంటుంది. అక్కడే కృంగి, కృషించి నశించిపోవాలి. లేదా ఎవరైనా కొట్టి కలపగా వాడుకోవాలి. లేదా ఆ చెట్ల యజమాని ఒకచోట నుంచి మరో చోటకు మార్పిడి అయినా చేయాలి. అంతేగాని చెట్టు తనంతట తానే మరోచోటకు వెళ్లే అవకాశం ఉండదు. అయితే, అందుకు విరుద్ధంగా గుజరాత్ లోని ఒక చెట్టు నడుస్తోంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వెయ్యేళ్ల వయసున్న చెట్టు కదులుతూ..
గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని ఉమర్గామ్ తాలూకాలో సంజన్ గ్రామంలో ఓ అద్భుతమైన మామిడి చెట్టు ఉంది. ఇటువంటి చెట్టు మరి ఎక్కడ బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ చెట్టు ఎక్కడా లేని విధంగా నడుస్తుంది. అలా అని ఈ చెట్టును ఎవరు నడిపించడం చేయరు. తనకి తానుగానే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ చెట్టు వయసు 1000 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని 50 వారసత్వ చెట్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అందుకే ఇక్కడ అధికార యంత్రాంగం దీనిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వల్సాద్ జిల్లాకు వచ్చి ఈ లెజెండరీ మ్యాంగో ట్రీను సందర్శిస్తుంటారు.
200 మీటర్ల దూరం కదిలిన చెట్టు..
ఈ గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ మామిడి చెట్టు 200 మీటర్ల వరకు కదిలింది. అలా ప్రతి ఏటా నడకను కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన కాండం నుంచి కొమ్మలు నేలకు సమాంతరంగా పెరుగుతాయని.. అందువల్ల ఇది నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు. 1300 సంవత్సరాల క్రితం మనదేశంలోకి వచ్చిన మొట్టమొదటి పార్సి సెటిలర్లు సంజన్ గ్రామంలో ఈ చెట్టును నాటారట. 936లో గుజరాత్ లో ఆశ్రయం పొందిన జొరాస్టయన్ శరణార్థులు తీర ప్రాంతంలో సంజన గ్రామాన్ని స్థాపించారని స్థానికులు చెబుతుంటారు.

అందుకే ఈ గ్రామానికి ఆ పేరు..
పార్సీలు తమ నివాస నగరమైన గ్రేటర్ ఖోరాసన్ లోని సంజన్ పేరు మీదుగా తాము నివసించిన ఈ గ్రామానికి కూడా సంజన్ పేరు పెట్టారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ సంజన్ గ్రామం మాజీ పోర్చుగీస్ కాలనీ అయిన డామన్ కేంద్ర పాలిత ప్రాంతానికి సమీపంలో ఉంది. సంజన్ లోని వాలి అహ్మద్ అచ్చు అనే రైతు పొలంలో ఈ పురాతన మామిడి చెట్టు ఉంది. ఈ వారసత్వ మామిడి చెట్టు తూర్పు వైపు కదులుతుందని స్థానిక పరిశీలకులు చెబుతున్నారు.
మామిడి చెట్టుకు ప్రత్యేక పూజలు..
వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ మామిడి చెట్టుకు గిరిజనులతో సహా ఇక్కడి స్థానిక నివాసితులు పూజలు చేస్తుంటారు. ఈ చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావించడం వల్లనే ఈ విధంగా పూజలు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. హిందువుల ఇళ్లల్లో తులసిని ఎలా ఆరాధిస్తారో.. ఇక్కడ ఈ మామిడి చెట్టును కూడా అలాగే కొలుస్తారు. దానికి ఎలాంటి హాని కలుగకుండా ఇక్కడి గ్రామస్తులు సంరక్షిస్తుంటారు.