Homeట్రెండింగ్ న్యూస్Karnataka: ఫ్రీ బస్సు ఎఫెక్ట్: మహిళా తలే ఇరుక్కుపోయింది

Karnataka: ఫ్రీ బస్సు ఎఫెక్ట్: మహిళా తలే ఇరుక్కుపోయింది

Karnataka: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాం అనే సామెత అంటే ఇదే కాబోలు.. అది బెంగళూరు మహానగరం. ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లేందుకు ఒక మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కింది.. బస్సులో భారీగా జనం ఉండడంతో ఉక్కపోత మొదలైంది. దాన్ని నుంచి ఉప శమనం పొందేందుకు ఆ మహిళ బస్సు కిటికీని తెరిచింది. అలా కిటికీని తల అద్దానికి ఆనించింది. ఈలోగా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆమె తల ఆ కిటికీలో ఇరుక్కుపోయింది. అంతే ఆ అద్దం అలా బిగుసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ మహిళ తల అందులో నుంచి బయటికి రాలేదు. దీంతో గత్యంతరం లేక తోటి ప్రయాణికులు లాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఆ మహిళ తల అలా ఇరుక్కుపోయి చాలాసేపు ఇబ్బంది పడింది. సరిగ్గా గాలి రాకపోవడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో కండక్టర్, డ్రైవర్ బస్సును నిలుపుదల చేసి, రోడ్డు పక్కన ఆపారు. ఆ తర్వాత అద్దాలను అతికష్టమ్మీద వదులు చేసి ఆమెకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించారు. ఆ కిటికీ అద్దాల నుంచి తల ఒక్కసారిగా బయటికి రావడంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది. బెంగళూరు నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఫలితంగా అది వైరల్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరుతో కాంగ్రెస్ నాయకులు తెరపైకి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడంతో పథకాన్ని అమలులో పెట్టారు. ఫలితంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం లభించింది. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు కండక్టర్లు జీరో టికెట్ కొట్టి, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఉచిత ప్రయాణం కావడంతో కర్ణాటకలో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. కొన్నిసార్లు సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

కర్ణాటక మాదిరే తెలంగాణలో కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. మహిళలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల కూర్చోడానికి సీట్లు కూడా ఉండటం లేదని పురుషులు వాపోతున్నారు. ఆమధ్య కొంతమంది మగవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో తమకు కూర్చునేందుకు సీట్లు కేటాయించాలని ఆందోళనలు కూడా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకం రోజుకో తీరుగా సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మునుముందు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version