https://oktelugu.com/

Village: ఊరూ పల్లెటూరూ.. దీని తీరే అమ్మ తీరు.. గుండె తడిని లేపే వీడియో

సాధారణంగా పల్లెటూరు అంటే ఆప్యాయతకు నిలువుటద్దంలా కనిపిస్తాయి. పండుగలప్పుడు సంస్కృతిని నిలువెల్లా ప్రతిబింబిస్తాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండగల సమయంలో పల్లెటూర్లకు ఎందుకు వస్తారంటే అదే కారణం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 7, 2024 / 11:28 AM IST

    Village

    Follow us on

    Village: అవనికి పచ్చ కోక చుట్టినట్టు ఉండే కొబ్బరి చెట్లు.. నిండుగా నీళ్లతో చెరువులు.. పచ్చటి పంట పొలాలు.. కల్మషం లేని మనసులు.. ఆప్యాయత అనురాగాలను పంచే మనుషులు.. అందుకే కదా దేశ ప్రగతికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ అన్నది.. కాకపోతే పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ వల్ల పల్లెటూర్లు కూడా ప్రభను కోల్పోతున్నాయి. నగరికరణ సంస్కృతి పల్లెటూర్లకు కూడా చొచ్చుకు రావడంతో పరిస్థితి ఒకసారి గా మారిపోతుంది. ఫలితంగా ఏవీ తండ్రి నిరుడు కురిసిన హిమకుసుమములు అని తలుచుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. అయితే కొన్ని పల్లెటూర్లు మాత్రం ఈ ప్రపంచీకరణకు దూరంగా ఉంటున్నాయి. అలాగని అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటున్నారని కాదు.. అక్కడ అభివృద్ధి జరగడం లేదని కాదు.. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం అక్కడికి వెళ్లలేదని అర్థం..

    సాధారణంగా పల్లెటూరు అంటే ఆప్యాయతకు నిలువుటద్దంలా కనిపిస్తాయి. పండుగలప్పుడు సంస్కృతిని నిలువెల్లా ప్రతిబింబిస్తాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండగల సమయంలో పల్లెటూర్లకు ఎందుకు వస్తారంటే అదే కారణం. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ సమస్తమైన ఈ రోజుల్లో పల్లెటూర్లకు ఏమాత్రం విలువ తగ్గలేదంటే దానికి కారణం అక్కడ ఉన్న పరిస్థితులే. మన దేశంలో, ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా కూడా ఒకప్పుడు పల్లెటూర్లలో పెరిగినవారే. రైతు కుటుంబాలలో ఎదిగిన వారే. అందుకే ఏ దేశమేగినా, ఎందుకాలిడినా.. ఎప్పుడో ఒకసారి ఉన్న ఊరికి వారు రాక తప్పదు. వారి స్వగ్రామం పల్లెటూరు అయినప్పటికీ రాకుండా వారికి మనసొప్పదు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది పల్లెటూర్ల బాట పడుతుంటారు. శ్రీమంతుల దగ్గర నుంచి రోజు వారి కూలి చేసుకునే వారు కూడా పల్లెటూరుకు సై అంటారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొంత గ్రామాలకు వస్తూ ఉండటం వల్ల టోల్ ప్లాజాల్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. సంపాదన అనేది అనివార్యం కావడంతో.. ఉన్న ఊర్లో సరైన ఉపాధి లభించకపోవడంతో.. చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే పండుగ రోజుల్లో కూడా సొంత గ్రామానికి వెళ్లకుంటే బాగోదని.. అలా వెళ్లకుండా ఉంటే సొంత ఊరితో పేగు బంధాన్ని తెంచుకున్నట్టే అని భావించి.. స్వగ్రామాలకు చాలామంది పయనం అవుతూ ఉంటారు.

    పల్లెటూర్ల గురించి సోషల్ మీడియా ప్రాముఖ్యం పెరిగిన తర్వాత వివరించే తీరు హృద్యంగా ఉంటున్నది. పల్లెటూరి గురించి, అక్కడ ఉండే మనుషుల గురించి, అక్కడి వాతావరణం గురించి విభిన్న రీతిలో సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్న్స్ రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు. అంతే అందంగా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఇస్మాయిల్ చిచ్చా అనే ఒక ఐడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ అయింది. అందులో ఆంధ్ర ప్రాంతంలోని ఒక పల్లెటూరు.. దాని నేపథ్యం.. అక్కడ ఉండే పరిసరాలు.. ఆ ప్రాంతంలో స్థిరపడిన మనుషులు.. అక్కడ పండే పంటలు.. ఇలా అన్ని నేపథ్యాలను కలిసి ఒక వీడియో గా రూపొందించారు. బ్యాక్ గ్రౌండ్ లో శతమానం భవతి సినిమా లోని మెల్లగా తెల్లారిందో ఎలా అనే పాటను యాడ్ చేశారు. చూడ్డానికి ఈ వీడియో చాలా బాగుంది. అన్నింటికీ మించి పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది అనిపించేలా చేసింది. సంక్రాంతి పండగ పూట కచ్చితంగా సొంత ఊరు వెళ్లాలి అనే భావన అందరిలో కలిగించింది. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. ఈ వీడియో చూసిన చాలామంది నగర జీవితం చాలా ఇబ్బందిగా ఉందని.. పండగ పూట సొంత ఊరు కి వెళ్లే ఆలోచన కలిగించిందని కామెంట్లు చేస్తుండడం విశేషం.