Tamil Nadu: సాధారణంగా రోడ్లమీద రోజు ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్రమాదాలలో పెద్దపెద్ద వాహనాలు బోల్తా పడుతుంటాయి. రోడ్లపై సరుకు రవాణా చేసే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. చేపలు తరలిస్తున్న లారీ, మద్యం రవాణా చేస్తున్న డిసిఎం, కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్.. ఇలా వాహనాలు బోల్తా పడే సంఘటనలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో రోడ్డు పక్కన పడిపోయిన సరుకులను జనం ఎగబడి తీసుకుంటారు. సరుకులు తరలిస్తున్న లారీలు బోల్తా పడితేనే జనం ఎగపడుతుంటారు. అలాంటిది బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడితే.. ఒక్కసారి ఊహించుకోండి ఏం జరిగి ఉంటుందో..
666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఓ ప్రైవేట్ కంటైనర్ లో తరలిస్తున్నారు. ఆ వాహనం తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలో చిట్టోడు అనే ప్రాంతం వద్ద సోమవారం అర్ధరాత్రి బోల్తా పడింది. ఒక ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థకు చెందిన ఈ వాహనంలో 810 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఈ ఆభరణాలను ఆ వాహనంలో కోయంబత్తూర్ నుంచి సేలం ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే సమతుపపురం సమీపంలో మూల మలుపు వద్ద డ్రైవర్ శశికుమార్ ఆ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు.
దీంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శశికుమార్ తో పాటు ఆ వాహనానికి సాయుధ సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న బాల్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్, సాయుధ పోలీస్ గార్డును వాహనం నుంచి బయటకు తీశారు. వైద్య చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు.
ఇంత ప్రమాదం జరిగినప్పటికీ, ఆ వాహనంలో నిల్వ చేసిన బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటనపై సదరు ఆభరణాలు తరలిస్తున్న వ్యాపారికి సమాచారం అందించారు. అంతేకాదు అప్పటికప్పుడు కొత్త వాహనాలు, మరి కొంతమంది సెక్యూరిటీ గార్డులను రప్పించి, ఆ ఆభరణాలను ఆ వాహనంలోకి ఎక్కించి పంపించారు. రాత్రిపూట ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. అదే పగటిపూట జరిగి ఉంటే.. ఏమైనా ఉందా.. జనం చూస్తుండగానే ఆభరణాలు పట్టుకెళ్ళేవారు.