
Tamil Nadu IPS: పోలీస్ అనగానే కొంతమంది తమకేదో రాజ్యాంగేతర అధికారాలు ఉన్నాయనుకుంటారు. నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తారు. విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తుంటారు. అయితే పోలీసులకు అధికారం ఉంది కాబట్టి అలానే చేస్తారని నూటికి 90 శాతం మంది భావిస్తారు. బాధితులుగా మిగిలిపోతారు. మిగిలిపోతున్నారు. కానీ, నిజం నిప్పులాంటిది అన్నట్లు.. ఏదో ఒకరోజు విషయం బయటపడుతుంది. తాజాగా తమళనాడులో విచారణ పేరుతో అధికార బలం ప్రయోగించిన ఓ ఐపీఎస్ ప్రతాపం బయటపడింది. ఈ విషయం బయటపడడంతో ప్రభుత్వం వేటు వేసింది.
చెన్నైలో పెరుగుతున్న లాకప్ డెత్‌లు..
ఇటీవలి కాలంలో తమిళనాడులో కస్టడీ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టే దిశగా చర్యలు చేపట్టింది. నేర విచారణలో భాగంగా ఆరోపణ ఎదుర్కొంటున్న వారిని తీవ్ర వేధింపులకు గురిచేసిన ఐపీఎస్ అధికారిపై తమిళనాడు ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయ విచారణ అనంతరం సదరు అధికారిపై పూర్తిస్థాయి చర్యలు ఉంటాయని తెలిపారు.
ఐదుగురిపై ఐసీఎస్ ప్రతాపం..
తిరునల్వేలి జిల్లా అంబాసముద్రంలో 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బల్వీర్ సింగ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పది రోజుల క్రితం ఓ దాడి కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని విచారణలో ఏఎస్పీ తమని తీవ్రంగా వేధించారని ఆరోపించారు. ఏఎస్పీ కటింగ్‌ప్లేర్‌తో తమ పళ్లను పీకడంతోపాటు, తమలో కొత్తగా వివాహమైన ఓ వ్యక్తి మర్మాంగాలపై దాడి చేశారని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. మర్మాంగాలపై దాడికి గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వీడియో వైరల్ కావడంతో ఘటనపై కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసేవరకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

క్రిమినల్ కేసుకు డిమాండ్..
విచారణ పేరుతో ఐదుగురిపై ప్రతాపం చూపిన ఐసీఎస్ అధికారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్పీని సస్పెండ్ చేసినంత మాత్రాన విచారణ సజావుగా సాగదని పేర్కొంటున్నారు. బాధితులను బెదిరించి తప్పుడు సమాచారం ఇప్పించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో తమిళనాడులో కస్టడీ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీసీటీవీ పర్యవేక్షణలో నేరస్తుల విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది.