Land On The Moon: తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల కోసమే. పిల్లల చదువుల కోసం కష్టపడి సంపాదిస్తారు. పెద్దయ్యాక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవద్దని స్థలాలు, పొలాలు, నగలు కొంటారు. తమ పిల్లలు ఏలోటూ రాకుండా ఉండాలని భావిస్తారు. నేటి తరం పిల్లలు కూడా పెద్దయ్యాక.. మా కోసం ఏం చేశారు.. ఏం సంపాదించారు.. అని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులను నిలదీస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేయడం, చంపడం కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రస్తుతం రోజుల్లో ఓ కూతురు తల్లి కోసం ఎకరం స్థలం కొనుగోలు చేసింది. అది అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా చంద్రుడిపైనే. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసి అమ్మకు గిఫ్ట్‌గా ఇచ్చింది.
పెద్దపల్లి జిల్లా మహిళ..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయింది.
ఆమెరికాలో ఉద్యోగం..
సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. తనకు జన్మనిచ్చి.. తన ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన అమ్మకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న సాయి విజ్ఞత.. చంద్రుడిపై స్థలం కొనుగోలు విషయం తెలుసుకున్నారు. ఈమేరకు 2022 మదర్స్‌డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకోసం ఎకరం స్థలానికి రూ.35 లక్షల వరకు చెల్లించింది. ఏడాది తర్వాత.. సరిగ్గా చంద్రయాన్–3 విజయవంతమైన రెండు రోజులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
మనుగడపై క్లారిటీ లేదు..
వాస్తవానికి చంద్రుడిపై జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్‌ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు.
రెండు నెలల కొడుకు కోసం..
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విజయ్ భాయ్ కథిరియా అనే వ్యాపారి 2021లో తన రెండు నెలల కుమారురు నిత్య కోసం చంద్రుడిపై స్థలం కొనాలనుకున్నాడు. దీని కోసం చేయాల్సిందంతా చేశాడు. చంద్రుడిపై స్థలం కొనటానికి అనుమతుల కోసం న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్ లూనార్ రిజిస్ట్రీకి మెయిల్ పెట్టాడు. మార్చి 13వ తేదీన అనుమతులు కూడా వచ్చాయి. సదరు కంపెనీ నుంచి విజయ్ రెండు నెలల కొడుకు నిత్య పేరుతో ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు కూడా వచ్చేశాయి. అంతే వ్యాపారి విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భార్యకు గిఫ్ట్‌గా..
రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా తన భార్య సప్నా కోసం చంద్రుని మీద భూమిని కొనాలన్న తన స్వప్నాన్ని 2020 డిసెంబర్‌లో నిజం చేసుకున్నాడు. చంద్రునిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా, డిసెంబర్ 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు. ‘వచ్చే వెడ్డింగ్ యానివర్సరీకి చంద్రుడి మీద స్థలం కొని నా భార్యకు బహుమతిగా ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయించుకున్నా. కానీ ఇది అంత ఈజీ కాదు. చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైతేనేం నా కల నెరవేరింది’ అని తెలిపాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర, సప్నా ఇద్దరూ అజ్మీర్ జిల్లాకు చెందినవారే. ఇద్దరూ ఇదే జిల్లాలో చదువుకున్నారు. కాలేజీలో కలుసుకున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.