Organ Donation: మాతృత్వం అనేతి ప్రతీ స్త్రీ పరిపూర్ణత్వానికి నిదర్శనం. వివాహమైన ప్రతీ యువతి మాతృత్వం కోసం పరితపిస్తుంది. గర్భం దాల్చింది మొదలు తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను తలుచుకుంటూ మురిసిపోతోంది. చిట్టి పాదాలతో తన్నినప్పుడు నొప్పి పుట్టినా ఓపికగా భరిస్తుంది. గర్భంలోని పాపాయి గుండె శబ్దాన్ని స్టెతస్కోప్‌తో విని మురిసిపోతుంది. కదలికలతో తన్మయం పొందుతుంది. ఇది ప్రతీ స్త్రీకి ప్రత్యక్ష అనుభవం. చనిపోయిన కొడుకు గుండె శబ్దం వినడం ఏ తల్లికీ సాధ్యం కాదు. కానీ వైద్యురాలు అయిన మాతృమూర్తి.. తన కొడుకు చనిపోయి తర్వాత కూడా అతని గుండె చప్పుడు వింటోంది. ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చనిపోయిన కొడుకు అవయవాలు దానం చేసి..
ఓ వైద్యురాలి కొడుకు చేతికి వచ్చాక అర్ధంతరంగా చనిపోయాడు. స్వయంగా వైద్య వృత్తిలో ఉన్న ఆమె కొడుకు పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని.. తనయుడి అవయవాలతో మరో నలుగురికి జీవం పోసింది. కళ్లు, మూత్ర పిండాలు, గుండె దానం చేసింది. చనిపోయిన గంట వ్యవధిలోనే తనయుడి గుండెను మరో వ్యక్తికి అమర్చారు. కళ్లతో ఇద్దరిక చూపునిచ్చింది. మూత్రపిండాలతో ఇద్దరికి ఒక్కో కిడ్నీ అమర్చి పునర్జన్మనిచ్చింది.
కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన దాత..
తన కొడుకు గుండెను దానం చేసి తనకు పునర్జన్మ ప్రసాదించిన తల్లి గురించి తెలుసుకున్న హృదయ స్వీకర్త.. ఓ రోజు ఆ మాతృమూర్తికి కృతజ్ఞత తెలుపుకునేందకు వచ్చాడు. స్వయంగా డాక్టర్ అయిన తల్లికి తన కొడుకు గుండె ఎవరికి అమర్చారో కూడా తెలియదు. కానీ స్వీకర్త వచ్చి.. ఆమె కొడుకు హృదయం తన శరీరంలో కొట్టుకుంటోందని చెప్పడంతో ఆ మాతృమూర్తి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే స్టెతస్కోప్ తీసుకుని సదరు వ్యక్తి హృదయ స్పందన వింటూ తల్లి హృదయం ఎంతగానో మురిసిపోయింది. చనిపోయిన తన కొడుకు హృదయం మరో వ్యక్తి శరీరంలో కొట్టుకోవడం విని ఆ తల్లి హృదయం చెప్పలేనంత ఆనందం పొందింది.
ఎవరికీ చెప్పరు..
సాధారణంగా అవయవ దాతలకు అవయవాలు ఎవరికి అమర్చారో చెప్పరు. అలా చెప్పడం వలన తరచూ బాధపడతారని, స్వీకర్తలను ఇబ్బంది పెడతారని వైద్యులు చెబుతారు. అందుకే స్వీకర్తల వివరాలు గోప్యంగా ఉంచుతారు. అవయవ స్వీకర్తపై గతంలో ఓ సినిమా కూడా వచ్చింది. ప్రయుడి కళ్లు దానం చేయగా, స్వీకరించిన వ్యక్తి కళ్లను ప్రేమించే స్టోరీతో సినిమా వచ్చింది. కానీ ఇక్కడ హృదయాన్నే దానంగా స్వీకరించిన వ్యక్తి మాత్రం దాత కుటుంబానికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు. ఇందుకోసం దాత వివరాలు సేకరించాడు. చిరునామా తెలుసుకుని మరీ ఇంటికి వెళ్లి తన గురించి తెలియజేశాడు. దీంతో దాత తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
నెట్టింట్లో వైరల్..
ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకు అవయవాలు దానం చేసిన తల్లికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెబుతున్నారు. తల్లి పడే ఆవేదన మాటలకందని వేదన.. మాతృదేవత.. కళ్లు చమర్చడం తప్ప మాటలు లేవు.. అమ్మా నీకు పాదాభివందనం.. అమ్మను మించిన దైవం లేదు.. అమ్మకు ఎవరూ సాటిరారు.. అంటూ ఆ తల్లి గొప్పదనానికి అభివాదం చేస్తున్నారు.
