
India vs Australia 4th Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఫలితం తీరడం చాలా కష్టమని, మ్యాచ్ కచ్చితంగా డ్రా అవుతుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లు బంతితో, భారత బ్యాటర్లు బ్యాట్ తో చెలరేగితే తప్ప ఈ మ్యాచ్లో ఫలితం ఆశించలేమని అతడు తేల్చి చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ లో విశ్లేషించాడు. గత మూడు టెస్ట్ మ్యాచ్ ల మాదిరిగా, ఈ మైదానం నుంచి బౌలర్లకు అంతగా సహకారం లభించడం లేదని కనేరియా అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఫలితం రావడం అనేది దాదాపు అసాధ్యమని స్పష్టం చేశాడు. అటు బంతి, ఇటు బ్యాట్ తో సంచలనాలు సృష్టించే అవకాశం లేనందున ఫలితం వచ్చే అవకాశం లేదని వివరించాడు.
” మైదానం ఆటగాళ్లకు సహకరించడం లేదు. గత మూడు టెస్ట్ మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్ సాగుతోంది. గత మూడు టెస్టుల్లో బౌలర్లు వికెట్ల పంట పండించారు. కానీ ఈ మ్యాచ్ విషయానికొస్తే అలాంటి అవకాశం లేకుండా పోయింది. మూడో రోజు ఇప్పటివరకు ఆస్ట్రేలియా బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీశారు. ఇక ఈ వికెట్ నుంచి ఆస్ట్రేలియా బౌలర్లకు సహకారం లభించడం లేదు. వికెట్ కూడా పెద్దగా టర్న్ కావడం లేదని” కనేరియా వివరించాడు.
ఇక ఈ మ్యాచ్ ప్రారంభంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ హెడ్ ఇచ్చిన క్యాచ్ ను భారత వికెట్ కీపర్ కె ఎస్ భరత్ జార విడిచాడు. దీంతో నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. అయితే దీనిపై కూడా కనేరియా స్పందించాడు. భరత్ అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడని, ఒక్క క్యాచ్ జార విడిచినంత మాత్రాన అతడిని ట్రోల్ చేయడం సరి కాదని హితవు పలికాడు.” చాలామంది భరత్ ను విమర్శించారు. అది సరైనది కాదు. అతడు కూడా అత్యుత్తమ వికెట్ కీపర్ లలో ఒకడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్ గ్రీన్ ను ఔట్ చేసేందుకు భరత్ అందుకున్న క్యాచ్ అద్భుతం. అలా కిందకు వంగి కూర్చొని క్యాచ్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకు అతనిని మనం అభినందించాలి అంటూ”నెటిజన్లకు క్లాస్ పీకాడు.

ఇక నాలుగో టెస్టులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఉస్మాన్ ఖవాజా, కామెరున్ గ్రీన్ చెలరేగి ఆడటంతో 480 భారీ స్కోరు సాధించింది. బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా జట్టు గిల్ సెంచరీ చేయడంతో కడపటి వార్తలు అందే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.