Pakistan Economic Crisis: చైనాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునుగుతున్నాయి. మొన్న శ్రీలంక, నిన్న పాకిస్తాన్ ఇక రేపేదేశమో తెలియడం లేదు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసిన పాపం డ్రాగన్ దే. విచ్చలవిడిగా అప్పులిచ్చి ప్రస్తుతం వాటిని చీకేసిన తాటికాయలా చేసింది. దీంతో రెండు దేశాలు ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ద్రవ్యోల్బణం దెబ్బకు కకావికలం అవుతున్నాయి. శ్రీలంకలో ఇప్పటికి కూడా పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.

పాక్ లో కిలో చికెన్ ధర రూ.650గా ఉంది. మాంసాహార ప్రియులు ఇక పస్తులుండాల్సిందే. జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాల్సిందే. వ్యాపార సిలిండర్ ధర రూ.10 వేలకు చేరింది. ఇక ప్రజల బతుకులు అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారాయి. ప్రొటీన్ల కోసం మాంసాహారం తినాలన్నా వారి కోరిక తీరడం లేదు. ధరల పెరుగుదల ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అటు శ్రీలంక, ఇటు పాకిస్తాన్ ను పతనం అంచుల్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం చైనాదే. దాన్ని నమ్ముకున్న పాపానికి రెండు దేశాలు ఇక కోలుకోని స్థితికి చేరడం గమనార్హం.
2022లో శ్రీలంక ఆర్థిక పతనం మొదలు కాగా 2023లో పాకిస్తాన్ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది. కొత్త సంవత్సరం వేళ పాక్ ను ద్రవ్యోల్బణం బాధిస్తోంది. ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ తరుణంలో పాక్ లో ప్రభుత్వం మళ్లీ ఆర్మీ చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. శ్రీలంక, పాక్ పతనంలో రెండు పాయింట్లు కామన్ గా కనిపిస్తున్నాయి. విదేశీ మారక నిల్వల కొరతతో ఏర్పడిన చమురు సంక్షోభం, రెండోది దీని వెనుక ఉన్నది చైనాయే అనే నిజం. డిసెంబర్ లో ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరడంతో ధరల పెరుగుదల అనివార్యమైంది.

పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాలు, వంట గ్యాస్, కరెంట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడికి అందుబాటులో లేవు. దీంతో పాక్ లో ప్రజలు అల్లాడుతున్నారు. ధరల పెరుగుదలతో ఏం చేయాలో తోచడం లేదు. పాక్ అప్పులు కొండల్లా పేరుకుపోయాయి. పాకిస్తాన్ లో వినియోగదారుల ధరల సూచీ డిసెంబర్ లో 24.5 శాతానికి పెరిగింది. పాకిస్తాన్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం ఏడాది కింద కేవలం 12.8 శాతంగా ఉన్న సీపీఐ ఇప్పుడు రెండింతలయింది. నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలా రెండు దేశాలను సర్వనాశనం చేసిన చైనా కుట్రలను ఆ దేశాలు పసిగట్టలేకపోయాయి. అప్పుల ఆశతో వాటిని పీల్చిపిప్పి చేసిన డ్రాగన్ వాటిని దయనీయ స్థితికి దిగజార్చడం గమనార్హం.