
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మంచి ఆటగాడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. అనేక సందర్భాల్లో తన మంచితనాన్ని వివిధ రూపాల్లో కోహ్లీ బయట పెట్టుకున్నాడు కూడా. తాజాగా చేసిన మరో సంఘటన కూడా విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని రుజువు చేసింది. ఆహారం వృధా కాకూడదని కోహ్లీ చేసిన ఆ పనికి నెటిజన్లు ఇప్పుడు ఫిదా అవుతున్నారు.
సెలబ్రిటీలు ఏ విషయంలోనూ రాజీపడరు. ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. ముఖ్యంగా తినే తిండి విషయంలో, తాగే నీటి విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గరు. అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే తినే తిండి విషయంలో వృధా కాకూడదని ఆలోచిస్తుంటారు. అటువంటి వ్యక్తి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. సాధారణంగా మన ఇళ్లల్లో మధ్యాహ్నం వండిన భోజనం మిగిలిపోతే రాత్రికి తింటుంటాం. కానీ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ సెలబ్రిటీ మిగిలిపోయిన భోజనం తినాల్సిన అవసరమే లేదు. కానీ విరాట్ కోహ్లీ ఆ పని చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ వంటకాలను క్షణాల్లో తన ముందుకు తెప్పించుకునే స్తోమత ఉన్న కోహ్లీ.. ఒకానొక సందర్భంలో ఆహారం వృధా కాకూడదని మధ్యాహ్నం మిగిలిన భోజనాన్ని తిన్నాడట. అది కూడా తన ఇంట్లో కాదు. ఫైవ్ స్టార్ హోటల్ లో. కేరళకు చెందిన ఓ చెఫ్ బయట పెట్టిన ఈ స్టోరీ.. నేటిజన్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా విరాట్ కోహ్లీ గొప్పతనం గురించి బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది.
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన..
దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కేరళ కు చెందిన పిళ్ళై అనే చెఫ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడంతో బయటపడింది. ”అది 2018. అప్పుడు నేను కేరళలోని రావిజ్ కోవలంలో పనిచేస్తున్నాను. త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ ఆడేందుకు వచ్చిన భారత క్రికెట్ జట్టు మా హోటల్లో బస చేసింది. వారికోసం అరేబియా సముద్రం నుంచి మంచి చేపలు తీసుకువచ్చి భోజనం సిద్ధం చేశాం. అయితే ఆ టీమ్ మొత్తంలో కోహ్లీ ఒక్కరే వెజిటేరియన్. ఆయన ఇవేవీ తినరు. దీంతో వెజ్ లో మంచి ఫుడ్ ఏంటని ఆయన అడగడంతో.. ‘సాధ్య’ రుచి చూడమని చెప్పా. దానికి ఆయన ఓకే చెప్పడంతో వెంటనే మేము సాధ్యను తయారు చేశాం. అయితే కేవలం ఒకే ఒక్క వ్యక్తికి అది వండటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ మేము కోహ్లీ కోసం దాన్ని సిద్ధం చేశాం’ అని పిళ్ళై తెలిపారు.
అప్పుడే ఆ సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది..
ఈ సందర్భంగా జరిగిన విషయాలను చెఫ్ మరింతగా పంచుకున్నారు. ‘నేనే దగ్గరుండి కోహ్లీకి అవన్నీ వడ్డించాను. సరిగ్గా అప్పుడే జరిగిన ఓ సంఘటన నన్ను ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. కోహ్లీ భోజనం పూర్తి చేసిన తర్వాత కొంత ఆహారం మిగిలిపోయింది. మిగిలిపోయిన భోజనాన్ని ఏం చేస్తారు అని కోహ్లీ నన్ను అడిగారు. అప్పుడు నేను.. ‘ఇది ఒక్కరి కోసమే వండిన ఆహారం సార్. దీన్ని పడేస్తాం’ అని చెప్పా. అది విన్న కోహ్లీ.. ‘భోజనాన్ని నాకు డిన్నర్ లో వడ్డిస్తారా..?’ అని అడిగారు. ఆ మాటతో నేను షాక్ అయ్యా. అయితే అందుకు హోటల్ నిబంధనలతో పాటు బీసీసీఐ మార్గదర్శకాలు అంగీకరించబోవని దాన్ని పడేస్తానని చెప్పాను. తనకోసం వండిన భోజనం ఇలా వృధా కావడం తనకు ఇష్టం లేదని, రాత్రి భోజనానికి ఇదే పెట్టాలని ఒత్తిడి చేయడంతో మేము సరే అనాల్సి వచ్చింది’ అని పిళ్ళై నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఒక గదిలో జరిగిన విషయం ఇది..
దీనిపై మరిన్ని విషయాలను చెప్పిన చెఫ్.. ‘ఓ స్టార్ క్రికెటర్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న వ్యక్తి. ఏదైనా కొనగలిగే స్తోమత ఉన్న ధనవంతుడు. ఇలా ఆహారం వృధా కాకూడదని మిగిలిపోయిన భోజనాన్ని తిన్నారు. ఇదంతా కెమెరాలు ముందు కాదు. ఎవరికి కనిపించని ఓ గదిలో. అది కోహ్లీ అంటే. ఆయన మంచి క్రికెటరే కాదు. గొప్ప మనిషి’ అని విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని ఆ చెఫ్ బయటపెట్టారు.
ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో బయట ప్రపంచానికి..
ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న చెఫ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టుతోపాటు కోహ్లీనీ అప్పుడు కలిసిన ఫోటోను షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ నిరాడంబరతకు అభిమానులు ఎంతగానో ముగ్ధులు అవుతున్నారు. విరాట్ కోహ్లీ మంచి క్రికెటరే కాకుండా.. మంచి మనసున్న మనిషి అంటూ కామెంట్లు పెడుతున్నారు.