Maripeda: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‌తో వెల్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రగా గాయపడ్డారు. చేపలలారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న జనం క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్‌ను ఎవరూ పట్టించుకోకుండా.. చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. డ్రైవర్ కోసం కనీసం 108కు కూడా సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. జనం ఎగబడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేశారు.
ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా..
ఖమ్మం జిల్లా నుంచి చేపల లోడ్‌తో వరంగల్ వైపు వెళ్తుండగా వ్యాన్ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై పడిన చేపల కోసం స్థానికులు ఎగబడడాన్ని కొంతమంది సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో చెక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రమాదం జరిగి డ్రైవర్ బాధపడుతుంటే.. స్థానికులు మాత్రం చేపల కోసం ఎగబడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. మీరింతే… మారరంతే అని విమర్శలు చేస్తున్నారు. ఫ్రీగా వస్తే మనోళ్లు అంతే మరి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
గతంలో జరిగిన ఘటనలు..
– ఈ ఏడాది మే నెలలో సికింద్రబాద్ బోయినపల్లి ప్రాంతంలో ఓ లిక్కర్ లారీ బోల్తాపడింది. ఆ లారీ నుంచి కేస్ కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడ్డాయి. దీంతో అక్కడకు పరుగున వచ్చిన జనం మద్యం కోసం ఎగబడ్డారు. మద్యం బాటిళ్లు ఎత్తుకుని పోయారు.
– కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై గతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో తొలుత అందరూ భయపడ్డారు. కానీ, కాసేపటి తర్వాత కొందరు స్థానికులు బకెట్లు పట్టుకెళ్లి పెట్రోల్ పట్టుకొచ్చుకున్నారు.
– ఇటీవల మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ వద్ద కోళ్ల వ్యాన్ బోల్తాపడింది. దీంతో కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న సమీప ప్రాంత ప్రజలు అక్కడకు చేరుకుని దొరికిన కోళ్లను దొరికినట్లు పట్టుకుని వెల్లారు.