Mancherial: కొన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. పెద్ద విషయం ఏమీ ఉండదు. కానీ సున్నిత మనస్కులు చిన్న విషయానికి కూడా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో జరిగింది. పదకొండు వందల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. షూ కొనుకునేందుకు తల్లి ఇచ్చిన రూ.1,100 కనబడకపోవడంతో తోటీ విద్యార్థులను నిలదీశాడు. దీంతో వారు తమను అనుమానించాడని, అవమానించాడని దాడి చేశారు. మూకుమ్మడి దాడి చేయడంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరువు పోయిందనే మనోవేదనతో అదే ఆసుపత్రిలో గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మందమర్రిలో గురువారం జరిగింది.
డబ్బులు పోయాయని..
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన కామెర ప్రభాస్(19) మందమర్రి మండలం పొన్నారం ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ సీవీ.రామన్ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తన డబ్బులు పోయాయంటూ తోటిæ విద్యార్థులను నిలదీశాడు. దీంతో రెచ్చిపోయిన తోటి విద్యార్థులు ప్రభాస్‌తో గొడవకు దిగారు. నీ డబ్బులు కాదు అసలు మా డబ్బులే నువ్వు దొంగతనం చేశావని ఆరోపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటూ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
మూకుమ్మడి దాడిలో తీవ్ర గాయాలు..
విద్యార్థుల మూకుమ్మడి దాడితో ప్రభాస్ మెడపై చాతిలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన హాస్టల్ సిబ్బంది.. హుటాహుటిన ప్రభాస్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే తనకు అవమానం జరిగిందని మనస్తాపం చెందాడు. గుర్తుతెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.