Hanamkonda: ఆర్థిక సంబంధాల మందు.. మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. డబ్బుల, భూములు, ఆస్తుల కోసం ఐనవారిని కూడా అంతమొంచించేందుకు వెనుకాడని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డబ్బుల కోసం ఓ అల్లుడు అత్తను కసితీరా కాల్చి చంపాడు. ఈ సంచలన ఘటన హనుమకొండలో గురువారం జరిగింది. నిందితుడిని కానిస్టేబుల్ ప్రసాద్‌గా గుర్తించారు.
రూ.4 లక్షల కోసం అత్త, అల్లుడి మధ్య గొడవ..
హనుమకొండ జిల్లాలోని గుడ్ల సింగారానికి చెందిన కమలమ్మ కూతురును మంచిర్యాలకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ప్రసాద్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రూ.4 లక్షల విషయంలో కొన్ని రోజులుగా కమలమ్మ, ప్రసాద్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం మంచిర్యాల నుంచి భార్యతో కలిసి గుండ్ల సింగారానికి వచ్చిన ప్రసాద్.. అత్తతో రూ.4 లక్షల విషయంలో మాట్లాడారు.
ఆవేశంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆవేశానికిలోనైన ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరుపడం, కమలమ్మ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. డబ్బుల కోసం జరిగిన వివాదలోనే ప్రసాద్ అత్త కమలమ్మను హతమార్చాడు.
అల్లుడిపై బంధువుల దాడి..
ఈ ఘటనతో షాక్ అయిన బంధువులు.. వెంటనే ప్రసాద్‌పై దాడిచేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని వారు వచ్చి ప్రసాద్‌ను ఎంజీఎంకు తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.