Bengaluru: భర్తతో విభేదాలతో కన్న కొడుకునే హత్య చేసింది కర్కశ తల్లి. నాలుగేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. స్నేహితురాలి ఇంటి వద్ద ఉన్నాడని నమ్మబలికింది. పోలీసుల దర్యాప్తుతో అడ్డంగా బుక్కైంది. అలాగని ఆమె సాధారణ మహిళ కాదు. ఓ స్టార్టప్ కంపెనీకి సీఈఓ. కానీ మూర్ఖత్వంతో కన్న కుమారుడ్ని మట్టుబెట్టింది. మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. ఈ విషాద ఘటన గోవాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన సుచనా సేథ్ మైండ్ ఫుల్ ఏ1 ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. దానికి సీఈఓ గా కూడా ఉన్నారు. ఆమెకు 2010లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. 2019లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే దంపతులు ఇద్దరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. దీంతో 2020లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆదివారాల్లో తన బిడ్డను కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పటినుంచి ప్రతి ఆదివారం ఆ నాలుగేళ్ల చిన్నారి తండ్రి వద్ద గడుపుతూ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సుచనా తన కుమారుడిని తీసుకొని ఈనెల 6న గోవాలోని సోల్ బన్యన్ గ్రాండ్ డే హోటల్ కు వచ్చింది. జనవరి 8న హోటల్ ఖాళీ చేసింది. ఆ సమయంలో ఆమె ఒక్కరే హోటల్ గది నుంచి బయటకు వచ్చారు. వచ్చేటప్పుడు కనిపించని పెద్ద లగేజ్ బ్యాగ్ ను హోటల్ సిబ్బంది గుర్తించారు.పైగా బెంగళూరు తిరిగి వెళ్ళేందుకు టాక్సీ కావాలని హోటల్ సిబ్బందిని కోరారు. విమానంలో వచ్చే ఆమె టాక్సీ అనేసరికి సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆమె గట్టిగా కోరడంతో స్థానికంగా ఉండే టాక్సీని ఆమెకు అప్పగించారు. అదే సమయంలో ఆమె ఖాళీ చేసిన గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే ఆమె గోవాను దాటిపోయారు.
దీంతో గోవా పోలీసులు రంగంలోకి దిగారు. సంబంధిత టాక్సీ డ్రైవర్ కు కాంటాక్ట్ అయ్యారు. డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు. బెంగళూరు నగరానికి తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని తీసుకెళ్లాలని టాక్సీ డ్రైవర్ కు కొంకాణీ భాషలో సూచించారు. ఈ విషయం సుచనాకు తెలియదు. టాక్సీ డ్రైవర్ అలానే చేశాడు. ఇంతలో గోవా పోలీసులు.. కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేశారు. సూచనాను అదుపులోకి తీసుకొని వారు విచారించారు. కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీశారు. అయితే చిన్నారిని స్నేహితురాలి వద్ద ఉంచాలని నమ్మబలికింది. ఓ అడ్రస్ కూడా తెలిపింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా ఫేక్ అని తేలింది.అయితే ఇంతలో ఆమె వద్ద ఉన్న భారీ లగేజ్ బ్యాగ్ ను పోలీసులు తెరిచి చూడగా మృతదేహం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.దీంతో తాను చేసిన నేరాన్ని సుచనా ఒప్పుకుంది. భర్తతో విభేదాలతో చిన్నారిని చంపేశానని చెప్పింది. భర్తతో తన కుమారుడు కలవడానికి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. దంపతుల మధ్య విభేదాలకు ఓ చిన్నారి బలి కావడం సంచలనం రేకెత్తించింది. అమ్మ ప్రేమను దూరం చేసుకున్న ఆమె తీరుపై ముప్పేట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను కఠినంగా శిక్షించాలని ఎక్కువమంది కోరుతున్నారు.