
Srikakulam: ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని కుక్కలు పొట్టనపెట్టుకున్నాయి. మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని తోటల్లోకి తీసుకెళ్లి చంపాయి. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస జంక్షన్ లో జరిగింది. అప్పటివరకూ చిట్టిపొట్టి మాటలతో సందడి చేసిన ఆ చిన్నారి నిద్రించడంతో తల్లి తన పనుల్లోకి ఉపక్రమించింది. ఇంతలో కుక్కల గుంపు వచ్చి మంచంపై నిద్రిస్తున్న చిన్నారిపై దాడిచేశాయి. పక్కనున్న తోటల్లోకి తీసుకెళ్లడాన్ని చూసిన మరో చిన్నారి కేకలు వేయడంతో తల్లి పరుగెట్టుకుంటూ అక్కడకు వచ్చింది. గోళ్లతో రక్కుతూ, మెడను కోరకడంతో తట్టుకోలేని తల్లి స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తరించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది.
సాయంత్రం నిద్రిస్తుండగా..
మెట్టవలస కూడలి వద్ద పైల రాంబాబు, మహాలక్ష్మి దంపతులు టిఫిన్ కొట్టు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో దుకాణం బయట మంచంపై రాంబాబు కూతురు ఏడాది వయసున్న సాధ్విక నిద్రిస్తోంది. అంతలో ఓ కుక్కల గుంపు అక్కడికి వచ్చి ఆ చిన్నారిపై దాడి చేసి, సమీపంలోని టేకుతోటలోకి ఈడ్చుకెళ్లాయి. చెల్లిపై కుక్కలు దాడిచేయడం చేసి భయపడిన రాంబాబు పెద్ద కుమార్తె కుసుమ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి తల్లికి ఆ విషయం చెప్పింది. ఆమె అరుస్తూ బయటకు రావడంతో అటుగా వెళ్తున్న వారు వెంటనే తోటలోకి వెళ్లి చిన్నారిని రక్షించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన సాధ్వికను విజయనగరం జిల్లా రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా సాధ్విక మృతి చెందింది.

హైదరాబాద్ ఘటన మరువక ముందే..
ఈ ఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్ లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. . నిజామాబాద్ కు చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చి అంబర్ పేటలో నివాసం ఉంటున్నారు. గంగాధర్ కారు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఆ రోజు సెలవు కావడంతో తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. ఈదాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆఘటన మరువకముందే శ్రీకాకుళం జిల్లాలో అటువంటి ఘటనే వెలుగుచూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీధి కుక్కలు చిన్నారులను వెంటాడి, వేటాడి చంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది.