
CM KCR: తెలంగాణ.. 60 ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం. రెండు విడతలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో తొలి విడత ఒక ఎత్తయితే.. రెండో విడత నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనడంలో అతిశయోక్తి లేదు. 1200 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలిస్తున్నారు. ఎన్నికల వేళ సెంటిమెంటు రగిలిస్తూ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారు. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయమే ఉంది. ఈ తరుణంలో మళ్లీ సెట్టిమెంటుతో కొట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. సీఎం కేసీఆర్‌ను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ నాడి పట్టుకున్న గులాబీ బాస్..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల నాడిని పట్టుకున్నారు. ఎక్కడ కొడితే ఆగ్రహిస్తారు.. ఏం చేస్తే లైన్‌లోకి వస్తారో కేసీఆర్‌కు తెలిసినంతగా తెలంగాణ రాజకీయ నేతలెవరికీ తెలియదు. అదే తెలంగాణ ఓటర్ల బలహీనత కాగా, కేసీఆర్‌కు మాత్రం అదే బలం. ఓటర్ల బలహీనతను తన బలంగా మార్చుకుని రెండు పర్యాయాలు గద్దెనెక్కారు కేసీఆర్. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు.
అంత ఈజీ కాదు..
అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది. రెండ పర్యాయాలు తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని, దానిని ప్రజల్లో రగిల్చడం ద్వారా ఓట్లు దండుకున్నారు. అయితే కేసీఆర్ ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఓట్ల వరకు ఒక మాట.. ఓట్లు ముగిసిన తర్వాత ఒక మాట చెప్పడం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవన్నీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే. ఎన్నికల తర్వాత ఇవేవీ అమలు కాలేదు. మరోవైపు గత రెండు పర్యాయాలు విపక్షాలు అంత బలంగా లేవు. ఇది కేసీఆర్‌కు కలిసి వచ్చింది.

పుంజుకున్న విపక్షాలు..
తెలంగాణలో ప్రస్తుతం విపక్షాలు బలం పుంజుకున్నాయి. బీజేపీ ఎక్కడ ఉంది అన్న కేసీఆరే ఇప్పుడు బీజేపీ మాట ఎత్తకుండా ఉండలేని పరిస్థితి. ఇక కాంగ్రెస్‌లో అంతర్గత గొడవలు ఉన్నా.. కార్యడర్ బలంగా ఉంది. 2014లో తాము తెలంగాణ ఇచ్చామని చెప్పినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఆలస్యంగా ఇచ్చారన్న కోపంతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఇక, 2018లో విపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకమేందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. విపక్షాలు బటపడగా, ప్రజల్లో మార్పు వచ్చింది. పాలకుల్లో మార్పు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వీటిని గుర్తించిన కేసీఆర్ మరోమారు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. కేంద్రానికి పన్నులు చెల్లించి మనమే కేంద్రాన్ని సాదుతున్నామని పువ్వాడ అజయ్‌కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది ఎవరు అనేది అందరూ గుర్తుంచుకోవాలని ప్రజలను కోరుతున్నారు.