CM Nara Chandrababu Naidu : చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఎండను తట్టుకోలేక పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్, షర్మిల, నందమూరి బాలకృష్ణ వంటి నాయకులు ఇబ్బంది పడుతున్న తరుణంలో.. చంద్రబాబు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎన్నికల ప్రచారం చేశారు. ఉక్కపోతను తట్టుకున్నారు. ఏమాత్రం నీరస పడకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒకే రోజు పదుల కొద్ది సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడం ఎంత ముఖ్యమో స్పష్టంగా వివరించారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా.. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
మధుమేహం ఉన్నప్పటికీ…
నారా చంద్రబాబు నాయుడికి మధుమేహం ఉంది. పైగా 70 సంవత్సరాల వయసు.. ఇంతటి వయసున్న వ్యక్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఒక విషయమైతే.. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వాటిని పూర్తి చేయడం మరో గొప్ప విషయం. ఇవాల్టికి చంద్రబాబు మితాహారం తీసుకుంటారు. పొరపాటున చక్కెర పదార్థాల జోలికి వెళ్లరు. అన్నం అసలు తినరు ఒకవేళ తిన్నా ముడి బియ్యంతో వండిన అన్నమే తింటారు. కొవ్వు, నూనెలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ముట్టను గాక ముట్టరు. అప్పుడప్పుడు కాల్చిన చేపలను మాత్రమే తింటారు. ఉదయం పూట బ్లాక్ కాఫీ.. ఒక వడ లేదా ఒక ఇడ్లీ మాత్రమే తింటారు. మధ్యాహ్నం ఫ్రూట్ సలాడ్, కాస్త అన్నం లేదా ఏవైనా పదార్థాలు తింటారు. సాయంత్రం పండ్లరసం తాగుతారు. రాత్రి కూడా ఫ్రూట్ సలాడ్ , చపాతీ లేదా జొన్న రొట్టె తింటారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు పాటిస్తున్నారు. అందువల్లే ఈ వయసులోనూ ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారు.
ఎటువంటి జర్కిన్ వేసుకోలేదు
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దావోస్ (davos) పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. ఆయన వెంట నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana chief minister revanth Reddy), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (it minister Sridhar Babu) జూరిచ్ (Zurich) లో కలుసుకున్నారు. వీరిలో చంద్రబాబు మినహా మిగతా వారంతా స్వెటర్లు వేసుకున్నారు. అవి కూడా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఉన్న స్వెటర్లు.. కానీ చంద్రబాబు స్వెటర్ కాదు కదా.. కనీసం మఫ్లర్ కూడా ధరించలేదు.. చంద్రబాబు వారితో కలిసి ఉత్సాహంగా ఫోటో దిగారు. పైగా వారంతా చంద్రబాబుతో పోల్చితే వయసులో చాలా చిన్నవాళ్లు..