Monkeys Own 32 Acres Land: సాధారణంగా గుడులు, దేవస్థానాలకు భూములు ఉండడం సహజం. దీప దూప నైవేద్యాల కోసం భూములను కేటాయిస్తారు. కానీ ఆ గ్రామంలో కోతుల పేరిట భూములు ఉండడం విస్తుగొల్పుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు 32 ఎకరాల భూమి కోతుల పేరిట ఉండడం విస్తుగొల్పుతోంది. దశబ్దాలుగా వానరాల పేరిట ఉన్న ఆ భూమి జోలికి ఎవరూ వెళ్లకపోవడం మరీ విశేషం. ఎక్కడైనా సెంటు భూమి ఖాళీగా కనిపిస్తే కబ్జాచేసే రోజులివి. అయితే ఆ కోతుల భూములు ఇప్పుడు సేఫ్ గా ఉండడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ భూములు కోతుల పేరిట రాసిందెవరు? దానికి ఆధారాలేవీ అంతుపట్టడం లేదు. గ్రామస్థులు కూడా నిర్థిష్టంగా చెప్పలేకపోతున్నారు. అటు రెవెన్యూ అధికారులు కూడా ధ్రువీకరించలేకపోతున్నారు. అటవీశాఖ ఆ భూములను సంరక్షిస్తుండడంతో.. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అటవీశాఖ భూమి అయి ఉంటుందని మాత్రం ప్రాథమిక నిర్థారణకు వస్తున్నారు. దానికి కూడా ధ్రువీకరణ చేయలేకపోతున్నారు.

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా ఉపలా పంచాయతీ ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో వందలాది కోతులు ఉన్నాయి. స్థానికులు వాటికి ఆహారం పెడుతుంటారు. గ్రామ సమీపంలో తిరుగుతూ కోతులు నిత్యం సందడి చేస్తుంటాయి. గ్రామానికి కాపలాగా ఉంటాయి. గతంలో వేలాది కోతులు ఉండేవి. కానీ ఇటీవల తగ్గుముఖం పట్టాయి. అయితే వాటికి గ్రామంలో 32 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములకు యజమానులు అవే. కానీ వాటికి ఆ విషయం తెలియదు. అలాగని గ్రామపెద్దలకు సైతం ఆ భూములు వాటి పేరిట ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. గ్రామ సర్పంచ్ బొప్పా పడ్వాల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల రికార్డులను పరిశీలించామని.. అవి కోతుల పేరిట ఉన్నట్టు చూశామని చెబుతున్నాడు. అలాగని గ్రామస్థులెవరూ కబ్జా చేసే ప్రయత్నం చేయలేదు. పంచాయతీ అవసరాలకు వినియోగిస్తామని భావించలేదు. కొద్దిరోజుల కిందట వనసంరక్షణ సమితి పేరుతో అటవీ శాఖ మొక్కలు నాటింది. దీనిపై రాష్ట్రస్థాయిలో ఎంక్వయిరీ చేసి కోతుల పేరిట భూములు ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని సర్పంచ్ పడ్వాల్ చెబుతున్నారు.

పూర్వీకుల కాం నుంచి గ్రామంలో ఎటువంటి వేడుకలు జరిగినా కోతులకే అగ్రతాంబూలం ఇచ్చేవారు. వాటికే ముందుగా బహుమానాలు ఇచ్చేవారు. మొక్కులు చెల్లించుకొని శుభకార్యాలు ప్రారంభించేవారు. అలా చేస్తేనే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయని అక్కడి ప్రజల నమ్మకం. అటు తరువాత గ్రామస్థులు కోతులకు ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. ఇళ్ల వద్దకు వస్తే మాత్రం ఆహారం పెడుతున్నారు. అయితే గతంలో కోతుల సంరక్షణ కోసం గ్రామకంఠం భూమిని అప్పటి పెద్దలు కేటాయించి ఉండే అవకాశం ఉందని గ్రామపెద్దలు అనుమానిస్తున్నారు. ఆ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి .. 32 ఎకరాల్లో కోతుల కోసం ప్రత్యేక కట్టడాలు చేస్తామని చెబుతున్నారు. మొత్తానికైతే ఆ గ్రామంలో కోతులు పెత్తందార్లు అన్నమాట.