Pawan Kalyan- Eenadu Paper: తెలుగునాట మీడియాకు రాజకీయం, కులతత్వం అతుక్కుపోయి చాలా సంవత్సరాలవుతోంది. మీడియా రాజకీయంగా, కుల ప్రాతిపదికన ఏనాడో వీడిపోయింది. ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా ..ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలవబడుతోంది. అయితే మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ మీడియాలు తమ ప్రాధాన్యతను మార్చేస్తుంటాయి. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తెలుగు మీడియా సంస్థలు స్ట్రాటజీని మార్చేస్తున్నాయి. పతాక శీర్షికలో కథనాలు ఇస్తున్నాయి. అయితే ఈ అనూహ్య మార్పు మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. పవన్ విశాఖ పర్యటన వివరాల కోసం ఈనాడు ఒక ఫుల్ పేజీ కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఆవిర్భవించిన ఈ సుదీర్ఘ కాలంలో ఎప్పుడూ ఇంత ప్రాధాన్యత, కవరేజీ ఇవ్వలేదు. సడన్ గా రామోజీరావు రూటు మార్చడం ఏమిటబ్బ అన్న ప్రశ్న మాత్రం ఎదురవుతోంది.

ఈనాడు పత్రికను ప్రారంభించిన తొలినాళ్లలో మాత్రం జర్నలిజం విలువలు పాటించారు రామోజీరావు. అత్యాధునిక సొబగులు అద్ది కోట్లాది మంది పాఠకుల అభిమానాలను సైతం సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ పురుడుబోసుకున్న తరువాత ఈనాడు పంథా మారిపోయింది. అటు తరువాత చంద్రబాబు చేతికి టీడీపీ వచ్చిన తరువాత రామోజీరావు వన్ సైడ్ అయ్యారు. ఇప్పటివరకూ చంద్రబాబు, టీడీపీకి అండదండగా నిలుస్తూ వచ్చారు. పవన్ జనసేన స్టార్ట్ చేసిన తరువాత కూడా ఈనాడులో కవరేజీ అంతంతమాత్రమే. అటువంటి ఈనాడులో పవన్ కు అత్యంత ప్రాధాన్యమివ్వడం మాత్రం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
అయితే దీనికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబుకు ఏపీలో ఇమేజ్ తగ్గింది. తన చర్యలతో పాటు ప్రత్యర్థుల ప్రచారం, గతంలో చేసిన తప్పిదాలు చంద్రబాబుకు ప్రతిబంధకంగా మారాయి. అయితే చంద్రబాబుకు సంక్షోభాలు ఎదురైన ప్రతీసారి రామోజీరావు అండగా నిలుస్తూ వచ్చారు. చంద్రబాబును కష్టాల నుంచి గట్టెంకించేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మెజార్టీ వర్గాల ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు. ప్రత్యామ్నాయంగా వారంతా పవన్ వైపు చూస్తున్నారు. తటస్థుల చూపు సైతం పవన్ వైపే ఉంది. అది ఎప్పటికప్పుడు తేటతెల్లమవుతోంది. అందుకే రామోజీరావు కూడా పవన్ పై ఫోకస్ పెంచడం ప్రారంభించారు. అందులో భాగమే ఇప్పుడు పవన్ కు ఈనాడులో విపరీతమైన కవరేజీ. టీడీపీకి ఆదరణ తగ్గడంతో.. ఈనాడు ఎన్ని కథనాలు సపోర్టుగా రాసినా ప్రజలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే రామోజీరావు ఆలోచనలో కూడా మార్పు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో జనసేనాని ఎటువంటి కార్యక్రమాుల నిర్వహించినా ఈనాడు లోపలి పేజీల్లో… కనీకనిపించని రీతిలో చిన్న వార్త వేసి వదిలేసేవారు. అటువంటిది సోమవారం నాటి ఈనాడు ప్రధాన సంచిక చూస్తే.. అరే ఇదే ఈనాడేనా అన్న అనుమానం వస్తోంది. ప్రత్యేక కథనంతో పాటు పవన్ విలేఖర్ల సమావేశం వార్తను సైతం ప్రచురించారు. అయితే రామోజీ స్ట్రాటజీ సడన్ గా మారడంపై అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. అటు టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. పవన్ కు ఇంత ప్రయారిటీ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఏదో జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. అటు సడన్ చేంజ్ పై మీడియావర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. విశ్లేషకులు మాత్రం పవన్ గ్రాఫ్ పెరుగుతుండడంతో రామోజీరావుకు వేరే గత్యంతరం లేదని.. అందుకే ఈ మార్పు అని లైట్ తీసుకుంటున్నారు.