2022 Roundup Bollywood: 2022 బాలీవుడ్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. ఎన్నో అంచనాలు ఉన్న సినిమాలు అడ్డంగా తన్నేశాయి. అటు ఫ్యాన్స్ ను నిరాశలో ముంచితే.. ఇటు నిర్మాతలకు కోట్లల్లో నష్టాలను మిగిల్చాయి. సరే సినిమా అన్నాక హిట్టు, ఫట్టూ కామనే. కానీ కొందరు బాలీవుడ్ నటీనటులకు ఈ ఏడాది దవడ వాచిపోయింది. నెటిజన్లు ఏకి పారేయడంతో మైండ్ బ్లాంక్ అయ్యింది.

-వివాదాలు
బాలీవుడ్ పవర్ హౌస్ రణ్ వీర్ సింగ్ ఒక మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చాడు.. వార్తల్లో వ్యక్తి అయ్యాడు. కొందరు ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లలో రణ్ వీర్ సింగ్ కు వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో అయితే రణ్ వీర్ సింగ్ ను ట్రోల్ చేశారు. ఇక మీమర్స్ అయితే పండగ చేసుకున్నారు. ఇక రణ్ వీర్ సింగ్ భార్య దీపికా, షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమాలో చేసిన బే శరం పాట కూడా చర్చకు తావిచ్చింది. ఇందులో దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీ అభ్యంతరకరంగా ఉందని ఓ పార్టీకి చెందిన నాయకులు ఆరోపించారు. ఆ సినిమాలోంచి పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. యాదృచ్ఛికంగా ఈ పాటపై కొన్ని ముస్లిం సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన “దీ కాశ్మీర్ ఫైల్స్” అనే సినిమా తీవ్రమైన చర్చకు దారి తీసింది. 90 వ దశకంలో కాశ్మీర్లో పండిట్ల కష్టాలను ప్రతిబింబిస్తూ తీసిన ఈ సినిమా కోట్లను కొల్లగొట్టింది. అయితే ఒక సెక్షన్ మాత్రం ఈ సినిమా పై పెదవి విరిచింది. కాశ్మీర్ ప్రజల కష్టాలను తమ ఓటు బ్యాంకుగా మలచుకుంటున్నారని బిజెపిపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ కాశ్మీర్ ఫైల్స్ భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. బాలీవుడ్ లో ఈ ఏటి మేటి చిత్రంగా నిలిచింది.
-పాపం అమీర్ ఖాన్
అప్పట్లో పీకే అనే సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అమీర్ ఖాన్ తర్వాత “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ఘోరంగా విఫలమైంది. దాని తర్వాత గ్యాప్ తీసుకొని లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటికే అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల మంట మీద ఉన్న కొంతమంది ప్రేక్షకులు ” బాయ్ కాట్” ట్రెండును సృష్టించారు. ఈ దెబ్బకు అమీర్ ఖాన్ సినిమా భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇదే సమయంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా పరాజయం పాలయింది. బాయకాట్ ట్రెండ్ వల్ల చాలామంది పెద్ద హీరోలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాక్వా లైన్ ఫెర్నాండేజ్ మనీ లాండరింగ్ స్కాం లో ఇరుక్కోవడం సంచలనం సృష్టించింది. సుఖేష్ చంద్ర శేఖర్ అనే వ్యక్తి పలువురిని మోసం చేసి మనీలాండరింగ్ కు పాల్పడ్డాడు. అయితే అతనితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జాక్వాలైన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలమార్లు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

ఇక ఐపీఎల్ లలిత్ మోడీ తాను మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్ తో డేటింగ్ లో ఉన్నానని ట్వీట్ చేయడం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పట్లో తనకంటూ చిన్నవాడయిన ఒక మోడల్ తో కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన సుస్మిత.. అతడికి కటీఫ్ చెప్పి లలిత్ మోడీ తో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం బాలీవుడ్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ లో ఈ సంవత్సరం చాలా వివాదాలే జరిగాయి. స్థూలంగా చెప్పాలంటే బాలీవుడ్ కు అస్సలు ఈ ఏడాది కలిసి రాలేదు