
Women Auto Drivers: తిరుపతి.. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన క్షేత్రం. తిరుపతి ఈపేరు వినగానే ప్రతీ హిందువులో ఒక ఆధ్యాత్మిక భావం. ప్రపంచలోనే రెండో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతికి నిత్య వేలాది మంది వస్తుంటారు. స్థానికంగా కూడా 5 లక్షలకు పైగా జనాభా ఉంది. ఈ క్షేత్రంలో 200 మంది మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. కుటుంబాలకు అండా ఉంటున్నవారు కొందరైతే.. చాలా మంది ఒంటరి మహిళలే.
ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ..
తిరుపతిలో ఆటో డ్రైవర్లుగా ఉపాధి పొందుతన్న 200 మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ ఉంది. వీరిలో చాలా మంది ఒంటరి మహిళలే. భర్త చనిపోవడం, భర్త వదిలేయడం ద్వారా పిల్లను పోషించేందుకు ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నవారే. భర్త చనిపోవడంతో ఎదరైన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు, భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పల్లతో సహా జీవనం సాగిస్తున్న మహిళలు ఇంటి అవసరాలు, పిల్లల చదువులకు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వివిధ ఆనారోగ్య కారణాలతో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇంటి యజమాని చనిపోవడంతో తమకు వేరే దిక్కులేక ఈ వృత్తిని ఎంచుకున్నామని కొంతమంది చెబుతున్నారు. ఇక కొంతమంది పిల్లలను, తనను భర్త ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడంతో పిల్లకు మంచి భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నామని చెబుతున్నారు.
రాస్ ఆధ్వర్యంలో శిక్షణ..
రాష్ట్రీయ సేవా సమితి(రాస్) అనే స్వచ్ఛంత సంస్థ 2016లో 106 మంది ఒంటరి మహిళలను చేరదీసింది. వీరందికీ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించింది. శిక్షణ అనంతరం డ్రైవింగ్‌పై పట్టు సాధించిన 75 మందికి లైసెన్స్ కూడా ఇప్పించింది. తర్వాత ఆటో కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థోమత లేని మహిళలకు రాస్ సంస్థ ష్యూరిటీగా ఉండి బ్యాంకు రుణాలతో ఆటోలు కొనుగోలు చేసేలా సాయం చేశారు. ఇలా ఆటోలు కొనుగోలు చేసిన 75 మంది ఆటోలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. కొంతమంది తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదువు చెప్పిస్తున్నారు. కొంతమంది భర్తలు చేసిన అప్పులను కూడా తీర్చేరు. మరోవైపు బ్యాంకు రుణాలుకూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు.
వీరి స్ఫూర్తితో మరికొంతమంది..
75 మంది మహిళా ఆటో డ్రైవర్ల స్ఫూర్తితో మరికొంతమంది మహిళలు డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నారు. ఇలా 2016 నుంచి ఇప్పటి వరకు మహిళా ఆటో డ్రైవర్ల సంఖ్య 200కు పెరిగింది. అయితే వీరికి ఆటో స్టాండ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల స్టాండ్‌లో పెట్టుకోవడానికి వారు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది నగరంలో ఉద్యోగులను ఆఫీస్‌కు తీసుకెళ్లి తీసుకురావడం, విద్యార్థినులను పాఠశాల, కాలేజీలకు తీసుకెళ్లి, తీసుకురావడం వంటివి ఎంపిక చేసుకుంటున్నారు. తమకు ఆటో స్టాండ్ కేటాయిస్తే ఆర్థికంగా రోజువారీ ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోజుకు రూ.750 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నామని, ఆటో స్టాండ్ ఉంటే రూ.1,500 వరకు రోజువారీ ఆదాయం వస్తుందని చెబుతున్నారు. పురుష డ్రైవర్లు మాత్రం తాము యూనియన్ ద్వారా ఆటోస్టాండ్ ఏర్పాటు చేసుకున్నామని తమ యూనియన్‌లో చేరితో స్టాండ్‌లో ఆటో పార్కింగ్‌కు అవకాశం ఇస్తామంటున్నారు.

మొత్తంగా పురుషాధిక్య సమాజంలో పురుషులకు దీటుగా తిరుపతి మహిళలు ఆటో డ్రైవర్లుగా రాణిస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒక్కోసారి అవమానాలు ఎదురైనా వాటిని దైర్యంగా ఎదుర్కొంటున్నారు.