https://oktelugu.com/

Canary Islands: బీచ్ ను చూడడం వరకైతే ఓకే.. ఇసుక, రాళ్లు ఎత్తుకెళ్తే.. భారీ ఫైన్

కానరీ దీవుల సమూహంలో లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా అనే బీచ్ లు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు పర్యటకులు భారీగా వస్తుంటారు. వచ్చినవారు వచ్చినట్టుగా ఉంటే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 23, 2024 / 09:48 AM IST

    Canary Islands

    Follow us on

    Canary Islands: సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామందికి అక్కడి బీచ్ లలో సరదాగా గడపడం అలవాటు. కొంతమంది బీచ్ సందర్శనకు గుర్తుగా ఇసుక లేదా రాళ్లను, గువ్వలను తీసుకెళ్తుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. స్నేహితులకో, తెలిసిన వాళ్లకు వాటిని చూపిస్తుంటారు. అయితే స్పెయిన్ లోని కానరీ దీవుల సమూహంలోని బీచ్ లలో సరికొత్త నిబంధన తెరపైకి వచ్చింది. ఆ సముద్ర తీర ప్రాంతాలను సందర్శించే వారికి ఇటీవల ఒక హెచ్చరిక జారీ అయింది. ఇంతకీ అదేంటంటే..

    కానరీ దీవుల సమూహంలో లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా అనే బీచ్ లు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు పర్యటకులు భారీగా వస్తుంటారు. వచ్చినవారు వచ్చినట్టుగా ఉంటే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాంతాలలో సందర్శించే పర్యాటకులు అక్కడి బీచ్ లలో ఇసుక, రాళ్ళను పట్టుకెళ్తున్నారు. మొదట్లో దీనిని అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా అలా తీసుకెళ్లడం విపరీతంగా పెరిగింది. దానివల్ల అక్కడి దీపాల పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు ఒక వినూత్న విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బీచ్ లను సందర్శించే పర్యాటకులు.. ఇసుక, రాళ్ళను తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రెండు లక్షల వరకు అపరాధ రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు పర్యాటకుల తాకిడి కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

    వాస్తవానికి సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక అత్యంత తేమగా ఉంటుంది. అక్కడి రాళ్లు కూడా విచిత్రమైన ఆకారంలో ఉంటాయి. రాళ్లు సముద్రపు కోత నుంచి పరిసర ప్రాంతాల్లో నేలను కాపాడుతుంటాయి. కొన్ని కొన్ని జంతువులకు అవి ఆవాసంగా ఉంటాయి. అయితే సందర్శకులు ఇసుకను, రాళ్లను తీసుకెళ్తుండడంతో ఒక్కసారిగా అక్కడి పర్యావరణంలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని జంతువులు తీరప్రాంతానికి కొట్టుకు వచ్చి చనిపోతున్నాయి. వాస్తవానికి అక్కడ ఇసుక ఉంటే ఆ జంతువులు ప్రత్యుత్పత్తి జరుపుకొని తమ సంతానాన్ని ఉత్పత్తి చేసేవి. ఆ రాళ్ల కింద బొరియలు ఏర్పాటు చేసుకొని జీవించేవి. అయితే ఆ రాళ్లను, ఇసుకను తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆ జీవులకు ఆవాసం కరువైంది. ఫలితంగా అవి చనిపోతున్నాయి. దీనివల్ల అక్కడి దీపాల పర్యావరణ వ్యవస్థ హానికర ప్రభావాన్ని ఎదుర్కొంటుందని అక్కడి అధికారులు వాపోతున్నారు. అపరాధ రుసుము విధించడం వల్ల చాలామంది ఇసుకను, రాళ్లను తీసుకెళ్లడం లేదని అక్కడి మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.