Fraud Bank Manager: “నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనయ్” అనే సామెత ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈ ఇండో అమెరికన్ మహిళ విషయంలో మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమైంది. మెరుగైన రాబడులు వస్తాయని వస్తాయని భావించి ఓ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టుగా పలు పొదుపు పథకాలలో ఆమె నగదు ఇన్వెస్ట్ చేసింది. ఇలా ఆమె ఇన్వెస్ట్ చేసిన సొమ్ము 13.5 కోట్లు. అయితే ఆ సొమ్మును బ్యాంకు మేనేజర్ స్వాహా చేశాడు. సొమ్మును మొత్తం చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు ఖర్చు చేశాడు.
శ్వేతా శర్మ అనే భారత సంతతికి చెందిన మహిళ భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. అక్కడ తన బ్యాంకు ఖాతా ద్వారా ఇండియాలోని ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ కు 13.5 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. అమెరికాతో పోల్చితే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలలో అధికంగా వడ్డీ వస్తుందని ఆ బ్యాంకు మేనేజర్ చెబితే శ్వేతాశర్మ ఆ నగదు అతడికి బదిలీ చేసింది. ఆ నగదును ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలలో పెట్టుబడిగా పెట్టాలని సూచించింది. నగదు పంపిన తర్వాత ఆమెకు నమ్మకం కలిగించేందుకు ఆ బ్యాంకు మేనేజర్ ఫేక్ స్టేట్మెంట్లు పంపించడం మొదలుపెట్టాడు. బ్యాంకు నుంచి నోటిఫికేషన్లు ఆమెకు రాకుండా ఉండేందుకు శ్వేతా వర్మ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడి సృష్టించాడు. అమృతంగా బ్యాంకు స్టేట్మెంట్లు మొత్తం అతడు సృష్టించిన ఫేక్ ఈమెయిల్ ఐడి కి వెళ్లి పోయేవి. శ్వేతా శర్మ 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఇలా విడతలవారీగా అతడికి 13.5 కోట్లు బదిలీ చేసింది. ఆ నగదు నాలుగేళ్లలో 16 కోట్లు అవుతుందని బ్యాంక్ మేనేజర్ చెబితే.. ఆమె పూర్తిగా నమ్మింది. అతడు చెప్పినప్పుడల్లా నగదు బదిలీ చేసింది.
తన భర్తతో కలిసి శ్వేతా శర్మ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. కొద్ది రోజులైన తర్వాత తన స్నేహితురాలి ద్వారా బ్యాంక్ మేనేజర్ ను కలుసుకుంది. డబ్బుల గురించి వాకబు చేస్తే “గత నెలలో మెరుగైన రాబడుల కోసం మీ డబ్బులను పెట్టుబడిగా పెట్టాను. ఆ డబ్బు మొత్తం పోయిందని” శ్వేతా శర్మ కు ఆ బ్యాంక్ అధికారి చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తన ప్రమేయం లేకుండా అలా ఎలా చేస్తారని నిలదీసింది. ఆ బ్యాంకు మేనేజర్ నుంచి నిర్లక్ష్యమైన సమాధానం రావడంతో ఆమె ఆ బ్యాంకు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో వారు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి శ్వేతా శర్మ లావాదేవీలు, బ్యాంకు మేనేజర్ రూపొందించిన ఫేక్ ఈమెయిల్ ఐడీ పై దృష్టి సారించారు. కాగా, ఆ బ్యాంకు మేనేజర్ శ్వేతా శర్మ డబ్బులను చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వాడారని తెలుస్తోంది. అంత సొమ్మును బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలా ఖర్చు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీ ప్రాంతంలో సంచలనంగా మారింది.