BCCI Central Contracts: టెస్ట్ క్రికెట్ ను కాపాడుకునేందుకు బీసీసీఐ వరాల ఎర

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో నాలుగు గ్రేడ్స్ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ లో ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం 7 కోట్లు దక్కుతాయి. ఏ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు ఐదు కోట్లు, బీ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు మూడు కోట్లు, సీ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు కోటి రూపాయలు అందుతాయి.

Written By: Suresh, Updated On : February 28, 2024 4:56 pm
Follow us on

BCCI Central Contracts: వర్థమాన ఆటగాళ్లు కేవలం టీ – 20 ల పైనే దృష్టి సారిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు మక్కువ చూపడం లేదు. ఐపీఎల్ వంటి టోర్నీలపైనే వారు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతున్న నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెబుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు లో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు పెంచే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు బోనస్ కూడా ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

“ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక ఆటగాడికి బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు లభిస్తాయి. వాటితోపాటు అదనంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా దక్కుతాయి. బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ వైపు ఆసక్తి చూపిస్తారని” భారత క్రికెట్ కౌన్సిల్ బోర్డు కు చెందిన ఒక ప్రతినిధి ప్రకటించారు.. వాస్తవానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లిస్టును నాలుగు గ్రేడ్ లుగా విభజించింది. ఆ గ్రేడ్ లలో ఉన్న ఆటగాళ్లకు వారి ప్రతిభ ఆధారంగా ప్రయోజనాలు ఇస్తుంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో నాలుగు గ్రేడ్స్ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ లో ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం 7 కోట్లు దక్కుతాయి. ఏ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు ఐదు కోట్లు, బీ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు మూడు కోట్లు, సీ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు కోటి రూపాయలు అందుతాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ తో పాటు టెస్ట్ మ్యాచ్ లు ఆడితే ఒక ఆటగాడికి 15 లక్షల చొప్పున అందజేస్తుంది. ఒకవేళ వన్డే లో అయితే ఆరు లక్షలు, టీ-20 లో మూడు లక్షలు అందజేస్తుంది.

ఏ+ గ్రేడ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. ఏ గ్రేడ్ లో హార్దిక్ పాండ్యా, రవి చంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు. బీ గ్రేడ్ లో పుజారా, రాహుల్, అయ్యర్, సిరాజ్, సూర్య కుమార్ యాదవ్, గిల్ ఉన్నారు. సీ గ్రేడ్ లో ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, చాహల్, కుల దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్ దీప్ సింగ్, భరత్ వంటి వారు ఉన్నారు. టెస్టుల వైపు ఆటగాళ్ళను మళ్లించేందుకు బీసీసీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టెస్టులు ఆడే క్రికెటర్లకు 15 లక్షలు అందజేస్తున్న బీసీసీఐ.. దీనిని 25 లక్షల వరకు పెంచుతుందని తెలుస్తోంది.

ముందుగానే చెప్పినట్టు వర్థమాన క్రికెటర్లు కేవలం టి20 మ్యాచ్ లు మాత్రం ఆడేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ కెరియర్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టే ఆటగాళ్లు కూడా వాటి వైపే వెళుతున్నారు. ఇలాంటి సమయంలో టెస్ట్ క్రికెట్ ను కాపాడుకోవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అంతేకాదు 4 గంటల్లో ముగిసే టి20 లకే ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి వారు ఫిట్ నెస్ లేమిని సాకుగా చూపిస్తున్నారు. అయితే అలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే మ్యాచ్ ఫీజు పెంపుదల నిర్ణయాన్ని బీసీసీఐ తెరపైకి తీసుకువచ్చింది. ఇక ఈ ఏడాదికి సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను అతి త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.