Komatireddy Venkat Reddy: రాజకీయాలు అనేవి కేక్ వాక్ లాగా ఉండవు. ఏదో ఒక రోజు ముసలం పుడుతుంది. అది కాస్త ఉపద్రవం అవుతుంది. అనంతరం ఒక్కసారిగా పరిస్థితులను మార్చేస్తుంది. మనదేశంలో ఇటువంటి పరిణామాలు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అనేకం చోటుచేసుకున్నాయి. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో కూడా ఇలానే జరిగింది. ఫలితంగా షిండే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ముసలం పుట్టించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. స్టోరీలను సర్కులేట్ చేస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం బాధిత పక్షం లాగా ఉన్నారు. ఆయనపై ఓ చానల్ అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేసింది. వాస్తవానికి ఇలాంటి కథనం హై లెవెల్ లీక్ లు లేకుండా బయటికి రాదు. అది అసాధ్యం కూడా.. ఎందుకంటే ఉన్నతాధికారుల బదిలీలు మొత్తం కూడా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంటాయి. ఎందుకంటే జిల్లాలలో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా లెక్కలు వేసుకొని ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. ఇటీవల బదిలీ అయిన ఆ జిల్లా కలెక్టర్ విషయంలో జరిగింది ఒకటైతే.. ఆ మీడియా ఛానల్ ప్రసారం చేసింది మరొకటి. ఈ వ్యవహారంలో మంత్రి వెంకట్ రెడ్డి తీవ్రంగా కలత చెందారు. తనకు ఇంత విషమిచ్చి చంపేయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గులాబీ మీడియా సొంత కథనాలను రాయడం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు మొదలైందని.. అది ఏ క్షణమైనా ఆయనను పదవి నుంచి దించేస్తుందని సొంత భాష్యం చెప్పడం మొదలుపెట్టింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరుగుబాటు ఆ కోణంలోనిదేనని.. ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారబోతున్నారని జోష్యం చెప్పింది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి, వెంకటరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరు కూడా అన్నా.. అన్నా అని పిలుచుకుంటారు. ఇటీవల డిసిసి అధ్యక్షుడి విషయంలో కూడా కోమటిరెడ్డి మాటనే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు.. చివరికి రాజగోపాల్ రెడ్డి ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. వెంకటరెడ్డి అండగా ఉన్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత.. రేవంత్ రెడ్డి కావాలని వెంకటరెడ్డి పై ఎలా కక్ష కడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి తిరుగుబాటు చేసే అవకాశం లేదని.. ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చిన విషయాన్ని కోమటిరెడ్డి మర్చిపోరని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. బిజెపి, బీఆర్ఎస్ నాయకులు శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలకు పాల్పడుతున్నారని.. వారి ఆశలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు నెరవేరవని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.