Telugu media :ఎప్పుడో దశాబ్దాల క్రితం శ్రీరంగం శ్రీనివాసరావు పత్రికలను ఉద్దేశించి.. అవి పెట్టుబడిదారుల విష పుత్రికలు అని వ్యాఖ్యానించారు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అది నూటికి నూరు పాళ్లు కాదు కోటిపాళ్ళు నిజం. ప్రకటనల కోసం.. ప్రభుత్వ నుంచి వచ్చే రాయితీల కోసం పత్రికలు కాదు పత్రికల యాజమాన్యాలు పాకులాడుతుంటాయి. అదే పత్రికలలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమంలో వెనుకంజ వేస్తుంటాయి.. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లో రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటాయి. మేనేజ్మెంట్ల దృష్టిలో నెంబర్ వన్, నెంబర్ 2 అనేది కేవలం ఫిగర్స్ మాత్రమే కాదు.. అవి వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే సంఖ్యలు. అందుకోసమే మేనేజ్మెంట్లు సర్కులేషన్ పెంచడానికి.. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ కు గంతలు కట్టడానికి సిద్ధంగా ఉంటాయి.. తెలుగు నాట మొదటి రెండు స్థానాలలో ఈనాడు, సాక్షి కొనసాగుతున్నాయి.. కరోనా సమయంలో సర్కులేషన్ తగ్గినప్పటికీ.. ఇటీవల కాలంలో పెరిగినట్టు ఎబిసి ర్యాంకింగ్స్ చెబుతున్నాయి.
అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చారు. ఆ వాలంటీర్లకు ప్రతినెల ఒక తెలుగు పత్రికను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. దీనికిగాను ప్రతినెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు ఐదు కోట్ల ప్రభుత్వ సొమ్మును కేటాయించారు. ఇది ఈనాడుకు తప్పుగా అనిపించింది. పైగా సాక్షిని బలవంతంగా కొనుగోలు చేయించడానికి ప్రభుత్వం సొమ్మును జగన్మోహన్ రెడ్డి ఖర్చుపెడుతున్నారని ఈనాడు ఆరోపించింది. ఆరోపించడమే కాదు ఏకంగా అమరావతి సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండడంతో ఈ కేసు విచారణ చాలా ఆలస్యంగా బెంచ్ మీదికి వచ్చింది. అనేక విచారణ తర్వాత.. ఏపీ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేసింది. ఈ కేసులో అనేక రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయని అభిప్రాయపడిన హైకోర్టు.. ఈ కేసును పరిష్కరించాలని ఢిల్లీ హైకోర్టుకు పంపింది.. ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానంలో కొద్దిరోజులపాటు ఈ కేసు కోల్డ్ స్టోరేజీలో ఉంది. ఆ తర్వాత 2024 లో విచారణకు వచ్చినప్పటికీ.. అప్పట్లో అన్ని పార్టీలు ఎన్నికల సమయం కావడంతో బిజీబిజీగా ఉన్నాయి. దీంతో కేసు కొద్దిరోజులు మళ్ళీ వాయిదా పడింది. చివరికి మంగళవారం ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు ఈ కేసు వచ్చింది. వాస్తవానికి ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానానికి కేసు రావడాని కంటే ముందు ఈనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఈనాడు పిటిషన్ ను పరిశీలించి.. హైకోర్టు పరిధిలోకే పంపించింది.

ఈ కేసు విచారణ విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం విచారణలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి ఈ కేసు నిరర్ధకమని వ్యాఖ్యానించింది. పైగా 2023 లో ఏ బి సి నివేదిక ప్రకారం ఈనాడు సర్కులేషన్ 13 లక్షలు గా ఉందని.. సాక్షి సర్కులేషన్ 10 లక్షల ఉందని వ్యాఖ్యానించింది. వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలు చేయించినప్పటికీ సాక్షి సర్కులేషన్ పెరగలేదు కదా అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.. ఈ కేసు ఇప్పుడు అవసరం లేదని తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సాక్షి తనకు అనుకూలంగా రాసుకుంది.. పచ్చ మీడియాకు దెబ్బ పడిందని.. కూటమి కుట్రలు వీగిపోయాయని రాసుకొచ్చింది. ఈనాడు ఈ వ్యవహారంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. రాతలు కూడా రాలేదు.
సాక్షి, ఈనాడు మధ్య జరిగిన ఈ యుద్ధంలో మొత్తం మేనేజ్మెంట్ల ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి.. నెంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ఈనాడు తాపత్ర పడుతూనే ఉంటుంది. ఎందుకంటే రామోజీ గ్రూప్ సంస్థలకు ప్రధాన ఆదాయవనరు ఈనాడు కాబట్టి. ఈనాడును కొట్టి తను నెంబర్ వన్ స్థానంలోకి రావాలని సాక్షికి ఎప్పటినుంచో ఆరాటం. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరగలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. అంటే ఇక్కడ ఈనాడు సుద్దపూస అని కాదు.. సాక్షిలో వచ్చేవన్ని నిజాలని కూడా కాదు. కాకపోతే మేనేజ్మెంట్లు తమ ప్రయోజనాల కోసం ఎక్కడి దాకైనా వెళ్తాయి. ఎంతదాకైనా తెగిస్తాయి. జగన్ ప్రతినెలా 5కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది కేవలం ఈనాడును కొట్టడానికే. నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్లకు ప్రత్యక్షంగా ఉత్తర్వులు ఇచ్చి.. పరోక్షంగా సాక్షిని కొనమని చెప్పారు.. ఇంత చేసినప్పటికీ ఈనాడును జగన్ అధిగమించలేకపోయారు..
అయితే ఇక్కడ సాక్షిని రెండో స్థానంలోనే ఆపాలని ఈనాడు శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి జగన్ కుట్రలు చేస్తున్నారని.. సాక్షిని మొదటి స్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈనాడు ఆరోపించింది. అయితే ఇక్కడ దానికి తగ్గట్టుగా బలమైన ఆధారాలను చూపించలేక చతికిల పడింది. సాక్షిని అడ్డంగా బుక్ చేద్దామని 2023లో జరిగిన ఏబీసీ రేటింగ్స్ ను బయట పెట్టవద్దని ఈనాడు కోరింది. కానీ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఆ నివేదికను బయటికి తీసుకొచ్చింది. ఆ నివేదికలో సాక్షి సర్కులేషన్ 10 లక్షల వరకే ఆగిపోయింది.. ఈనాడు సర్క్యులేషన్ 13 లక్షలకు పైగా ఉంది. ఇది మీకే అనుకూలం కదా అని ఢిల్లీ హైకోర్టు ఈనాడు ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఇప్పుడు జగన్ అధికారంలో లేరు.. వలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి ఈ కేసు వల్ల ఉపయోగం లేదని గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ జగన్ అధికారంలో ఉండి.. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులో ఉంటే కోర్టు ఇలానే వ్యాఖ్యానించేదా? అప్పుడు ఈనాడు నెంబర్ వన్ స్థానం ఇలాగే ఉండేదా? ఈ ప్రశ్నలకు హైకోర్టు వద్ద సమాధానం లేదు. ఈనాడు చెప్పినా వినేవాళ్లు లేరు.