Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) విడుదల చేసిన హడావిడి షెడ్యూల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు” అంటూ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.
షాకిచ్చిన ఎన్నికల నోటిఫికేషన్
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసి, కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్ 27వ తేదీనే తొలి విడత నామినేషన్ వేయమంటే, పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కనీసం తమ దరఖాస్తు పత్రాలను సిద్ధం చేసుకోవడానికి, ముఖ్య నాయకులతో సంప్రదించడానికి, ప్రణాళికలు రూపొందించడానికి కూడా సమయం లేకుండా పోయిందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి:
తొలి విడత ఎన్నికలు: డిసెంబర్ 11వ తేదీ
రెండో విడత ఎన్నికలు: డిసెంబర్ 14వ తేదీ
మూడో విడత ఎన్నికలు: డిసెంబర్ 17వ తేదీ
నామినేషన్ల షెడ్యూల్
అదే విధంగా, ఈ మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా చకచకా జరగనుంది. మొదటి ఫేజ్ నవంబర్ 27వ తేదీ నుండి.. రెండవ ఫేజ్ నవంబర్ 30వ తేదీ నుండి.. మూడవ విడత డిసెంబర్ 3వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
‘ఆగమాగం’ ఎందుకు?
సాధారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ఈసారి ప్రభుత్వం ఇంత ఆగమాగంగా పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం వెనుక ఉన్న కారణాలు ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా ఉదయిస్తున్నాయి.
కేవలం కొద్ది రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి, నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండాలంటే, తగినంత సమయం ఇవ్వాలని కోరుకుంటున్నారు.