AP New Districts: ఏపీలో( Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏపీలో గత కొద్దిరోజులుగా అనేక రకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా జిల్లాల ఏర్పాటు పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న జిల్లాలకు తోడుగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయని ప్రకటన చేశారు. మార్కాపురం, మదనపల్లి, రంప చోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. అయితే అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఐదు రెవిన్యూ డివిజన్లు, ఆపై ఒక మండల కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ విషయంలో గత కొద్దిరోజులుగా అధ్యయనం చేస్తున్న క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అదే విషయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు.
* హేతుబద్ధత లేకుండా విభజన..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రభుత్వంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే జిల్లాల విభజనలో ప్రజల మనోభావాలకు తగ్గట్టు నిర్ణయం తీసుకోలేదని ఒక విమర్శ ఉంది. కనీస హేతుబద్ధత ప్రకటించలేదన్న కామెంట్ ఉంది. అందుకే చంద్రబాబు ప్రజల మనోభావాలను గమనించి ఎన్నికల ప్రచారంలో ఆయా ప్రాంతాల అభిమతానికి అనుగుణంగా ప్రకటనలు చేశారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసిన మంత్రుల బృందం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. అందులో భాగంగానే ఏపీవ్యాప్తంగా మూడు జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అదే విషయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు.
* తెరపైకి కొత్త మండలం..
మరోవైపు ఏపీలో కొత్త మండలం ఏర్పాటు కానుంది. కర్నూలు( Kurnool ) జిల్లా ఆదోని మండలాన్ని విభజించి.. కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజనులతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవిన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవి పట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. చింతూరు డివిజన్లో ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాలను చేర్చారు.
*:ఆ రెండు జిల్లాల ఏర్పాటు లేనట్టే..
అయితే ఏపీలో చాలావరకు కొత్త జిల్లాల ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా పలాస తో ( Palasa)పాటు మంగళగిరి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు సంబంధించి అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యేక జిల్లాల ఏర్పాటులో అనేక రకాల సందేహాలతో పాటు వినతులను స్వీకరించింది. స్థానిక మనోభావాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంది. విజయనగరం జిల్లాలో ఎస్ కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తూ వచ్చింది. ఇప్పటికే విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో ఎస్ కోట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అదే సమయంలో విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అయితే ఈ రెండు చోట్ల జిల్లాల మార్పు ఉండాలని అక్కడ ప్రజలు భావించారు. అయితే అనవసర ఇబ్బందులు వస్తాయని భావించి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మంగళగిరి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా పరిగణించాలన్న డిమాండ్ ఉంది. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడతో పాటు గుంటూరు నగరాలను కలపాలన్న డిమాండ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరి ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పలాస నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని అక్కడి ప్రజలు భావించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఇచ్చాపురం తో పాటు పలాస నియోజకవర్గ ప్రజలు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. చెంతనే ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో పాటు టెక్కలి నియోజకవర్గాన్ని పలాస జిల్లాలో కలపాలన్న డిమాండ్ ఉంది. అయితే అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. అందుకే ప్రభుత్వం పలాస జిల్లాను పరిగణలోకి తీసుకోలేదు. మొత్తానికైతే ఏపీలో కొత్తగా మూడు జిల్లాలతో పాటు మరో మండల కేంద్రం ఏర్పాటు కానుంది అన్నమాట. అదే సమయంలో రెవిన్యూ డివిజన్లలో చాలా మండలాల చేర్పులతో పాటు మార్పులు సంతరించుకోనున్నాయి.